రసకందాయంలో బెజవాడ రాజకీయం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉంటే...ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ‍్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేయడం చంద్రబాబు నాయుడు అలవాటు అయిన విషయం తెలిసిందే. దీంతో తనకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్... ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.