లారీ బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే.. | Vijayawada As Carafe Address For Body Building Of Lorries | Sakshi
Sakshi News home page

లారీ బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే..

Published Thu, Feb 16 2023 11:00 AM | Last Updated on Thu, Feb 16 2023 3:16 PM

Vijayawada As Carafe Address For Body Building Of Lorries - Sakshi

సాక్షి, కృష్ణాడెస్క్‌: వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ లారీల బాడీ బిల్డింగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. లారీలకు బాడీలు తయారు చేసే నిపుణులు ఇక్కడే ఉన్నారు. కొత్తగా లారీ కొనుగోలు చేస్తే దానికి బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో లారీలను ఆటోనగర్‌ తీసుకొస్తారు. ఒకప్పుడు యజమానులు ఆరు టైర్ల లారీలకే పరిమితమయ్యేవారు. కానీ నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో  16 టైర్ల లారీలపై మక్కువ కనబరుస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేసినా బాడీలు కట్టించడానికి మాత్రం విజయవాడ తేవాల్సిందే.

కరోనా విలయతాండవం తర్వాత కొన్ని రంగాల్లో పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. విజయవాడలోని జవహర్‌ ఆటోనగర్‌ కార్మికులు చేతి నిండా పనులతో ఉపాధి పొందుతున్నారు. ఎంతో ప్రసిద్ధి  చెందిన ఆటోనగర్‌లో ప్రస్తుతం లారీల బాడీ బిల్డింగ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఆరుటైర్లు ఉంటే ఎంతో గొప్పగా భావించే లారీల యజమానులు ఇప్పుడు 16 టైర్ల లారీలను కొనుగోలు చేసి వాటికి బాడీలు కట్టిస్తున్నారు.

వీటికి మెయింటెనెన్స్‌ తక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా 35 టన్నుల వరకు లోడు వేసుకునే అవకాశం ఉందని చెప్పారు.  ఆరు టైర్ల వాహనాలకు ప్రతి 18 వేల కిలోమీటర్లకు ఇంజిన్‌ ఆయిల్‌ మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.  16 టైర్ల వాహనాలకు (లారీ)  ఇంజిన్‌ ఆయిల్‌ 80 వేల కిలోమీటర్లకు మారిస్తే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు.

దీంతో ఈ లారీలనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నామని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం లారీలన్నీ  కర్నూలు జిల్లా బేతంచర్ల, నెల్లూరు, వైజాగ్, గుంటూరు, పొన్నూరు, తదితర ప్రాంతాల నుంచి ఆటోనగర్‌కు వస్తున్నాయి. 10 నుంచి 15 రోజుల్లో లారీ బాడీ బిల్డింగ్‌ పనులు పూర్తి చేస్తున్నారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో బాడీలు కడుతున్నారు.

ఎంతో మంది వృత్తి నిపుణులు...
ఒక్కో లారీ బాడీ బిల్డింగ్‌ చేయడానికి 11 రకాల వృత్తి నైపుణ్యాలు కలిగిన కారి్మకులు అవసరం. కార్పెంటరీ, టింకరింగ్, కమ్మరం, పౌండ్రి, పెయింటర్, ఎల్రక్టీíÙయన్, అద్దాలు, సట్లు, స్టిక్కరింగ్, టైర్లు తదితర పనుల్లో స్కిల్‌ వర్కర్లు అందుబాటులో ఉంటారు. సుమారు రెండు వారాల పాటు వీరంతా శ్రమిస్తే గానీ 16 టైర్ల లారీలకు బాడీ బిల్డింగ్‌ పూర్తి కాదు. ఆటోనగర్‌లో సుమారు వెయ్యి మందికిపైగానే కారి్మకులు ఉన్నారు. వీరంతా లారీల బాడీల తయారీ పనుల్లో పాలుపంచుకుంటారు.  

ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్‌ యూనిట్లు
కరోనాకి ముందు: 200  
కరోనా తర్వాత : 100 
ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నవి : 50 
16 టైర్ల లారీకి బాడీ బిల్డింగ్‌ పూర్తి చేయడానికి పట్టే సమయం: 10 నుంచి 15 రోజులు  
ఒక్క లారీ బాడీ బిల్డింగ్‌కి అయ్యే ఖర్చు రూ.4.80 లక్షలు  
ఒక్కో కార్మికుడికి రోజు కూలీ: రూ.1,000 నుంచి రూ.1,200  
ఆటోనగర్‌ నుంచి పని పూర్తి చేసి బయటకు పంపే లారీల సంఖ్య రోజుకు: 50 
వర్క్‌ బిజీగా ఉండే మాసాలు (సీజన్‌) : జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్‌ 
(సీజన్‌లో ఈ ప్రాంతంలో లాడ్జిలు, హోటళ్లు బిజీ బిజీగా ఉంటాయి)
చదవండి: పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అ­తి­థుల మన్ననలు..

ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం 
16 టైర్ల బాడీ బిల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఎక్కడా లోటు లేకుండా పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసి యజమానులకు అప్పగిస్తాం. గత మూడు నెలల నుంచి ఆటోనగర్‌కు 16 టైర్ల లారీలు వస్తున్నాయి. ఈ లారీలో 35 టన్నుల లోడింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. బాడుగ కూడా ఎక్కువ వస్తుంది.  ఆయా కంపెనీలకు చెందిన వారు 16 టైర్ల లారీలకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసి బాడీ బిల్డింగ్‌ కోసం బెజవాడ వస్తున్నారు. కరోనా తర్వాత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. 
–సంపర మల్లేశ్వరరావు, షెడ్‌ యజమాని  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement