
Heavy Rains In AP Updates:
బుడమేరు వాగు ఉధృతి
భారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహం
సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలు
బుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావు
లోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలు
కృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందం
విజయవాడలో దంచికొడుతోన్న వర్షం
రోడ్లు జలమయం
పొంగిపొర్లుతున్న డ్రైన్లు
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు
విద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరు
గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.
కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.