చిలుకూరు, న్యూస్‌లైన్: ఆధార్ కార్డుల ప్రక్రియ సెప్టెం బర్ నుంచి ప్రారంభం కానున్నది. అం దుకోసం ప్రస్తుతం ఉన్న కేంద్రాలు కాక జిల్లాకు మరో 126 ఆధార్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో జి ల్లాలో ఆధార్ కష్టాలు తొలగనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి, గతంలో కొనసాగుతున్న పథకాలకు తప్పని సరిగా ఆధార్ కార్డు పిన్ నంబర్ అనుసంధానం చేయడంతో ఆధార్ కార్డుకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది వివిధ పథకాల ద్వారా లబ్ధిపొం దుతుండగా ఇప్పటి వరకు కేవలం 25 లక్షల మందికి మాత్రమే ఆధార్‌కార్డులు ఉన్నాయి.
మిగిలిన10 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాలు పొం దాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో గర్భిణులకు అందిస్తున్న పారితోషికానికి ఆధార్‌కార్డు తప్పని సరి. గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని నగదు బదిలీ రూపంలో అందజేసేందుకు ప్రభుత్వం ద్వారా పింఛన్లు పొందుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూడా ఆధార్ కార్డు తప్పని సరిగా అవసరం. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఆధార్ కార్డు ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నా నేటికీ అర్హులైన లబ్ధిదారులందరికీ ఆధార్ కార్డు అందని పరిస్థితి దాపురించింది. ఆధార్ కార్డుల నమోదు బాధ్యతలు చేపట్టిన గుత్తేదారులు సరైన రీతిలో నమోదు ప్రక్రియను చేపట్టకపోవడం, దీనికితోడు ఆ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించపోవడం వంటి కారణాలతో ఆధార్ కార్డుల నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతూ వస్తున్నది.
నూతనంగా మరో 126 కేంద్రాలు
ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇటీవల జిల్లాకు 200 కేంద్రాలు మంజూరయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 145 కేంద్రాలు ఏర్పాటు చేయగా మిగిలినవి రెండు రోజుల్లో అనుసంధానం చేసేందుకు అదికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆధార్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మరో 126 కేంద్రాలను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2.70లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందుతుండగా, 6.34 లక్షల మంది సబ్సిడీ ద్వారా గ్యాస్ పొందుతున్నారు. అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా 10 లక్షల మంది, ఐసీడీఎస్ ద్వారా జననీ సురక్ష పథకం కింద మరో 92 వేల మంది లబ్ధిపొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం. వీరందరికీ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
చిలుకూరుకు నాలుగు కేంద్రాలు
చిలుకూరు మండలానికి త్వరలో నాలుగు ఆధార్ కేంద్రాలు కొత్తగా వస్తున్నాయి. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు వచ్చిన ఆధార్ కేంద్రాల ద్వారా కేవలం లభ్ధిదారులకు మాత్రమే దించాం. కానీ, ఈ సారి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు దిగనివారందరికీ కార్డులు అందజేస్తాం.
- ఎన్. సూర్యనారాయణ, తహసీల్దార్, చిలుకూరు
తొలగనున్న ఆధార్ కష్టాలు
Published Sat, Aug 31 2013 3:15 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement