సాక్షి ప్రతినిధి, కడప: తన ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ తీయాలనేదే ఆయన ఏకైక లక్ష్యం. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అధికారం అండతో తెరవెనుక మంత్రాంగం నడిపి పై చేయి సాధించారు. ఆయనే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఆ క్రషర్ సీజ్ చేయాల్సిందే. సీజ్ చేయకపోతే సహించేది లేదు. మీరేమి చేస్తారో తెలియదు. శ్రీనివాస స్టోన్ క్రషర్‌ను మూసేయండి. ఈ విధంగా ఎన్నికల అనంతరం నిత్యం మైనింగ్ అధికారులకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నుంచి ఒత్తిడి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అధికార పార్టీ ఎమ్మెల్యే పైగా ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్న ఆయన ఒత్తిడి భరించలేక, ఒకదాని తర్వాత మరొకటి చకచకా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శ్రీనివాస స్టోన్ క్రషర్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిలో క్రషర్ యూనిట్ ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1993 నాటి నుంచి అదే స్థానంలో రన్నింగ్‌లో ఉన్న క్రషర్‌పై ఒక్కమారుగా మైనింగ్ యంత్రాంగానికి ప్రభుత్వ భూమి గుర్తుకు రావడానికి కారణాలు లేకపోలేదు. దాదాపు 21 సంవత్సరాలు అనుమతించిన అధికారులు అందుకు బాధ్యులు కారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
లీజు సైతం రద్దు...
శ్రీనివాస స్టోన్ క్రషర్ లీజు సైతం మైనింగ్ డిప్యూటి డెరైక్టర్ పుల్లయ్య రద్దు చేసినట్లు సమాచారం. ఆ క్రషర్‌పై రూ.68 లక్షలు జరిమానా వేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సంబంధిత మంత్రిత్వశాఖను సంప్రదించాలని తదుపరి కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ఆమేరకు మైనింగ్ మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ప్రస్తుతం స్టోన్ క్రషర్ ప్రభుత్వ స్థలంలో ఉందని సీజ్ చేశారు. దాంతో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించలేదు. అంతలోనే అపరాధ రుసుం చెల్లించలేదనే కారణంగా మైనింగ్ డీడీ పుల్లయ్య శ్రీనివాస స్టోన్ క్రషర్ లీజు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆ క్రషర్‌పై అంత ప్రేమెందుకో...
శ్రీనివాస స్టోన్ క్రషర్ విషయంలో నిబంధనలు తరచి చూస్తున్న అధికారులు శ్రీసాయి స్టోన్ క్రషర్ వద్దకు వచ్చేసరికి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం మూడు హెక్టార్లకు మాత్రమే లీజు ఉన్న శ్రీసాయి స్టోన్ క్రషర్ విచ్చలవిడిగా మైనింగ్ చేస్తోంది. ఇప్పటికే 15 ఎకరాలకు పైగా కొండను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇవేవీ మైనింగ్ యంత్రాంగానికి కన్పించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి వార్తకు స్పందన...
12 క్రషర్లకు రిలీజ్ ఆర్డర్లు...
టార్గెట్...సీజ్ అన్న శీర్షికతో మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మైనింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. సీజ్ చేసిన క్రషర్ యాజమానుల నుంచి అపరాధం మొత్తంలో ఒక భాగం చెల్లించి, అఫిడవిట్ ఇచ్చిన 12మంది యజమానులకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు కడప మైనింగ్ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. నిబంధనల మేరకే కంకర మిషన్లు సీజ్ చేశామని తెలిపారు.
స్టోన్ క్రషర్ సీజ్
Published Wed, Sep 3 2014 2:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement