సాక్షి,కడప: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల బదిలీపై సందిగ్ధం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా,పరోక్షంగా తమకు ఎలాంటి సంబంధం లేక పోయినా అక్రమంగా బదిలీ చేస్తున్నారంటూ కొందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు హైకోర్టును ఆశ్రయంచారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బదిలీ చేశారని, మరో మారు బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓల పాత్ర ఏమిటి, వారి సేవలను ఏవిధంగా వినియోగించుకుంటారో తేలేవరకు బదిలీల ప్రక్రియను ఆపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈవీఎంల పర్యవేక్షణ, మాడల్ కోడ్, జోనల్ అధికారులుగా ఎంపీడీఓలు పనిచేస్తారని కలెక్టర్ నివేదించినట్లు సమాచారం. వీరిని తప్పక బదిలీ చేయాల్సిందేనని ఎన్నికల కమిషన్ పట్టుబడుతోంది. జిల్లాలో ప్రస్తుతం మూడేళ్ల సర్వీసు పూర్తి కావడంతోపాటు సొంత జిల్లాకు చెంది 39 మంది ఎంపీడీఓలు, ముగ్గురు ఈఓపీఆర్‌డీలు ఉన్నట్లు పంచాయతీ రాజ్ కమిషనర్‌కు జిల్లా పరిషత్ సీఈఓ ఇప్పటికే జాబితా పంపారు. ఇందులో చింతకొమ్మదిన్నె ఎంపీడీఓ సాంబశివారెడ్డి, చిన్నమండెం ఎంపీడీఓ రవికుమార్ మెడికల్ లీవులో ఉన్నారు. అట్లూరు ఎంపీడీఓ జూలి జసంత ఈనెలలో బదిలీ కానున్నారు. దువ్వూరు ఎంపీడీఓ బాలసరస్వతి కూడా జూన్ నాటికి బదిలీ కానుండటంతో వీరికి బదిలీ వేటు తప్పే అవకాశముంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా.. :
గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ బదిలీలకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఎంపీడీఓలు అవాక్కవుతున్నారు. ఎన్నికల విధులకు సంబంధించి తమకు ఎలాంటి పాత్ర లేకపోయినా బదిలీల జాబితాలో చేర్చడంపై ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వంటి విధులు గతంలో నిర్వహించి ఉంటేనే బదిలీ చేసేవారని పేర్కొంటున్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎంపీడీఓలు :
జిల్లాకు చెందిన ఎంపీడీఓలు గత ఆదివారం కలెక్టర్‌ను కలిసి తమ బదిలీ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను బదిలీ చేశారని, మళ్లీ బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఖాదర్‌బాష, విజయకుమారి, సుధాకర్, మొగిలిచెండు సురేష్ తదితరులు ఉన్నారు. అయితే ఎన్నికల విధులతో వీరికి సంబంధం ఉందని, బదిలీ చేయాల్సిందేనని ఎన్నికల కమిషన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
సందిగ్ధం
Published Sat, Feb 15 2014 1:41 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement