ఆగని అకృత్యాలు
Published Wed, Dec 4 2013 2:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :అర్ధరాత్రి వేళ మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్టు..ఇవి మహాత్ముని మాటలు...అయితే పగలే మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మృగాళ్ల వెకిలిచేష్టలు ,వేధింపులకు భయపడి మహిళలు తనువులు చాలిస్తున్న సందర్భాలు అనేకం. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలు సైతం వారిని కాపాడలేకపోతున్నాయి. మహిళలపై జరిగే అత్యాచారాలు దాడులను నిరోధించేందుకు ఈ ఏడాది మార్చి నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయినప్పటి కీ మృగాళ్ల తీరు మారలేదు. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మానవమృగాలు విషం కక్కుతూనే ఉన్నాయి. వికృతంగా అకృత్యాలకు పాల్పడుతూనే వున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 8న జిల్లాలో తొలి నిర్భయ కేసు తెనాలిలో నమోదైంది. తన కుమార్తె మౌనికతో కలసి వెళుతున్న బేతాళ కాంత సునీల అనే మహిళను అటకాయించిన మృగాళ్లు మౌనిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన సునీలను లారీ కిందకు నెట్టి వేయటంతో మృతి చెందింది. వీరందరిపై తెనాలి వన్‌టౌన్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్టోబర్‌లో గుంటూరు వల్లూరివారితోటకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమించాలని వెంటపడి వేధిం చాడు. ఇదేమిటని అడిగిన యువతి తండ్రిపై దాడిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
చిన్నారిపై తండ్రి అసభ్యకర ప్రవర్తన
సత్తెనపల్లి పట్టణం నాగన్నకుంటలో ఉండే కూరగాయల చిరువ్యాపారి దామర్ల లక్ష్మయ్య తన మూడేళ్ల కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భర్త చేష్టలను అసహ్యించుకున్న
భార్య పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.
= గడచిన పదినెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా మహిళలపై అత్యాచారం, అత్యాచార యత్నం, వేధింపుల కేసులు మొత్తం 363 నమోదయ్యాయి.
= వీటిలో 36 కేసులు నిర్భయ చట్టం కింద నమోదయ్యాయి. తెనాలిలో 8, బాపట్లలో 4, నరసరావుపేటలో 9, సత్తెనపల్లిలో3, గుంటూరు ఈస్ట్, వెస్ట్ సబ్ డివిజన్లలో 6 చొప్పున నమోదయ్యాయి.
గత మూడేళ్ల కాలంలో జరిగిన నేరాలను పరిశీలిస్తే..
= 2010లో 50 అత్యాచారం కేసులు, 305 అత్యాచారయత్నం,వేధింపుల కేసులు నమోదయ్యాయి.
= 2011లో 69 అత్యాచారం, 230 అత్యాచారం, వేధింపుల కేసులు నమోదయ్యాయి.
= 2012లో 47 అత్యాచారం, 257 అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదయ్యాయి.
= ఈఏడాది అక్టోబర్ చివరి నాటికి 58 అత్యాచారం, 305 అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదు.
= 185 కేసుల్లో నేటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
ఎంతటి వారినైనా ఉపేక్షించం
రూరల్ ఎస్పీ జె. సత్యనారాయణ
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దాడులకు, నేరాలకు పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ హెచ్చరించారు. వీలైనంత వరకు మహిళలు ఒంటరిగా వెళ్లకుండా తోడు వుండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళ వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాలన్నారు. ఒక వేళ స్నేహితులతో వెళ్లాల్సి వస్తే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నారు. పోలీసుల సహాయం అవసరమైతే డయల్ 100 ను ఆశ్రయిస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు.
Advertisement
Advertisement