అత్తిగారిపల్లె అతలాకుతలం
గాలివాన బీభత్సం
పెనగలూరు : మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. 2.25 గంటలకు ప్రారంభమై అర్ధగంట వ్యవధిలో అతలాకుతలం చేసి ంది. ముఖ్యం గా అత్తిగారిపల్లెలో అనేక రకాలుగా నష్టాలు మిగిల్చింది. ఆ గ్రామానికి చెం దిన బొడ్డు వేములయ్య ఇంటిపై చెట్టు కూలడంతో.. పైకప్పు రేకులు కూలిపోయాయి. ఇంట్లోని టీవీ, డీవీడీతో సహా పగిలిపోయాయి. వస్తువులు, దుస్తులు, బియ్యం తడిచిముద్దయ్యాయి. అక్కడ తలదాచుకునేందుకు వీలులేకుండా పోయింది. అలాగే నాగమ్మ ఇంట్లో ఉండగానే పైకప్పు రేకులు కూలిపోయాయి. పరిస్థితిని గమనించిన ఆమె బయటికి వచ్చేలోపే రేకులు కూలి పోయి వస్తువులన్నీ దెబ్బతిన్నాయి.
పరిగెత్తే సమయంలో కిందపడి గాయాలపాలైంది. అదే విధంగా సుబ్బమ్మ ఇం టిపైఉన్న రేకులు లేచిపోవడంతో ల్యాప్ టాప్, టీవీ నీళ్లలో మునిగిపోయాయి. వస్తువులను వదిలేసి మొదట ప్రాణాల నుంచి బయట పడటానికి అనేక మంది ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తిప్పన లక్షుమయ్య, పూలతోటి శంకరమ్మ, రామాంజులు, నారయ్య, వెంకటయ్య ఇళ్లపై రేకులు కూడా ఎగిరిపోయాయి. ఇంకా చాలా మంది ఇళ్లలో నష్టాలు జరిగాయి. సాదక్‌వల్లి పొలం వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ స్తంభంతో సహా పడిపోయింది.
తడిబట్టలతో మిగిలాం
గాలివానకు ఇంట్లో కూర్చుని ఉండగా ముందు భాగంలో ఉన్న చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న టీవీతో సహా వస్తువులు, బియ్యం తడిచాయి. అప్పులు చేసి రేకులు ఇల్లు వేసుకుంటే గాలివాన మాకు అప్పులు మిగిల్చింది.
- వేములయ్య, అత్తిగారిపల్లె
ప్రాణాలు దక్కించుకున్నా:
వర్షం కురవడంతో ఇంట్లో ఉండ గా పైకప్పు రేకులు ఒక్క సారిగా విరిగి కింద పడ్డాయి. ఎందుకో భయం వేసి ఇంట్లో నుంచి తలుపు వద్దకు వచ్చే సరికే చెట్టు కూలి రేకులు ఇంట్లో పడ్డాయి. ఇంట్లోనే ఉండి ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేది. ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలి.
- నాగమ్మ, అత్తిగారిపల్లె
కంప్యూటర్ నీళ్లలో మునిగింది
మా కుమారుడి చదువు కోసం అప్పులు చేసి కంప్యూటర్ తెచ్చుకుంటే గాలివానతో రేకులు లేచి పోయి కంప్యూటర్, టీవీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
- సుబ్బమ్మ, అత్తిగారిపల్లె