గాలివాన బీభత్సం
♦ పలుచోట్ల పండ్లతోటలకు అపారనష్టం
♦ దెబ్బమీద దెబ్బతో కుంగిపోతున్న రైతన్న
♦ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
సాక్షి, కడప : ప్రతిసారి ప్రకృతి ప్రకోపానికి అన్నదాత బలి అవుతూనే ఉన్నాడు. కరువుతో ఒకవైపు.. గాలివాన బీభత్సంతో మరోవైపు అన్నదాతకు అపార నష్టం సంభవించింది. నెలరోజుల వ్యవధిలోనే మరోమారు ప్రకృతి రైతన్నను దెబ్బ తీసింది. ప్రతిసారి ప్రకృతి చేస్తున్న గాయాలతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. తాజాగా వీచిన గాలులు, వర్షం ధాటికి జిల్లాలో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. వరుసగా రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నా... ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు.
గాలివానకు దెబ్బతిన్న పండ్ల తోటలు
జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం వర్షం, వీచిన గాలులకు పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా వీరబల్లి మండలంలో బాగా కాపు దశలో ఉన్న మామిడి చెట్లు కొన్నిచోట్ల నిలువునా కూలిపోయాయి. అలాగే గాలుల ధాటికి మామిడి చెట్ల నుంచి కాయలు విరివిగా రాలిపోయాయి. దీంతో ఒక్క వీరబల్లి మండలంలోనే రూ.10నుంచి 15లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలంలో సుమారు వంద ఎకరాల్లో అరటి, మామిడి, ఆకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సుమారు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లెలో కూడా గాలి దెబ్బకు ఆకుతోటలు, అరటి చెట్లు కూలిపోయాయి. ప్రస్తుతం గెలల దశలో ఉన్న అరటి చెట్లు కూలిపోవడంతో భారీ నష్టం సంభవించింది. ఒక్క పార్నపల్లె, చుట్టు పక్కల ప్రాంతంలోనే రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక్కడే కాకుండా ఇంకా చాలాచోట్ల పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
పండ్ల తోటలకు సంబంధించి జిల్లాలో భారీ నష్టం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఒకట్రెండు సార్లు గాలి,వానల దెబ్బకు పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో భారీగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. కనీసం ప్రభుత్వమైనా స్పందించి వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.