సాక్షి ప్రతినిధి, కడప: ‘విధేయతే మార్గం -పదవే లక్ష్యం’ అన్న సూక్తి ఆయనకు అతికినట్లు సరిపోతుంది. పదవి కోసం అధినేతల వద్ద విధేయత చూపడం ఆతర్వాత వారిని విస్మరిస్తుండటం అనవాయితీగా వస్తోంది. గడిచిన ఐదేళ్లకాలంలో ఎవరు పదవిలో ఉంటే వారికి విధేయత చూపిన ఘనత జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లాకే దక్కుతోంది. కొత్త మంత్రి వర్గం ఏర్పడి మరో ఛాన్స్ దక్కుతుందని భావించగా రాష్ట్రపతిపాలన దిశగా అధిష్టానం అడుగులు పడుతుండటంతో నిరాశే మిగులుతోంది.
రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్న అహ్మదుల్లా అనతి కాలంలోనే రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఐదేళ్ల పదవీకాలాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. నాలుగవసారి కూడా అవకాశం దక్కుతుందేమోనని ఎదురు చూస్తుండగా కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గుచూపుతుండటంతో మరో ఛాన్సుకు బ్రేకు పడనున్నట్లు సమాచారం.
వైఎస్ విధేయుడిని అంటూనే...
కడప నియోజకవర్గానికి 2004లో అహమ్మదుల్లా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ చలువతోనే రాజకీయాల్లో వచ్చానని, ఆయన పెట్టిన భిక్షతోనే పదవి దక్కిందని ప్రకటించారు. 2009లో మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్మదుల్లాకు వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. వైఎస్ రుణం తీర్చుకోలేనిదని మరోమారు అహ్మదుల్లా స్పష్టం చేశారు. వైఎస్ అకాలమరణం చెందడం, కొన్ని కారణాలతో వైఎస్‌కుటుంబం కాంగ్రెస్‌పార్టీని వీడింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, దేవగుడి ఆదినారాయణరెడ్డి వైఎస్ కుటుంబం వెన్నంటే నడిచారు. అహ్మదుల్లా కూడా అదేబాటలో నడుస్తారని భావించారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రి పదవి పదిలం కావడంతో వైఎస్ కుటుంబాన్ని విస్మరించారు.
కిరణ్ వెంబడి ఉంటూనే..
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం ఆయనకు విధేయుడుగా అహ్మదుల్లా కొనసాగారు. పదవికి కిరణ్ దూరం కాగానే అయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అహ్మదుల్లా వంటి నేతలను చూసి కిరణ్ బలుపుగా భావించారని ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కాగానే పరిస్థితి అర్థమయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, కొత్త ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండాలని అహ్మదుల్లా అలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలనవైపు అడుగులు పడుతుండటంతో అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
కథ అడ్డం తిరిగింది
Published Sat, Mar 1 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement