
టీ తమ్ముళ్లకు బాబు 'బిస్కెట్లు'
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు రింగరింగామంటూ దూసుకొస్తున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో 'కారు' బ్రేకులు కత్తిరించి, 'చెయ్యి'ని నేలమట్టం చేసి సైకిల్తో దూసుకుపోవాలని వ్యూహా రచన చేస్తున్నారు. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల (టి తమ్ముళ్లకు) తో గత వారంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 29 స్థానాలకు గాను15 స్థానాలు బీజేపీ పొత్తుతో కైవసం చేసుకున్నాం... ఇదే ఊపు ఉత్సాహంతో బీజేపీతో పొత్తు లేకుండా ముందుకు వెళ్లితే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మనదేనంటూ తమ్ముళ్లను ఉత్సాహపరిచారు.
బల్దియా పీఠం కైవసం చేసుకుంటే.... నజరానాలు ఎలా అందనున్నాయో కూడా బాబు గారు ఈ సందర్భంగా విశదీకరించి మరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక దేవాలయాలు గల జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలోని టీటీడీ దేవాలయం, కాణిపాకం వినాయక స్వామి దేవాలయాల మొదలు .... కర్నూలు జిల్లా శ్రీశైలం, విజయవాడలోకి శ్రీకనకదుర్గ దేవాలయ పాలకమండళ్లలో ఛైర్మన్ , సభ్యులుగా నియమిస్తానంటూ భరోసా ఇచ్చేశారు. దాంతో దేవుని సేవలో తరించి పోవచ్చని తెలంగాణలోని పచ్చ తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు.
అయితే బాబుగారు ఓ విషయం మాత్రం గమనించినట్లు లేదు.... తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలు తీసుకుని తిరుమలకు వెళ్తుంటే ... టీటీడీ అధికారులు 'ఆ సిఫార్సు' లేఖలను చించి బుట్టలో వేస్తున్నారు. అంతేందుకు సాక్షాత్తూ చంద్రబాబు కేబినెట్లోని దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు సిఫార్సు లేఖను తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు నాలుగు రోజుల కిత్రం ఊఫ్ మని గాలికి ఊదేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో మంచి కాక మీద సీమాంధ్రులు ఉన్నారు. అదికాక ఆంధ్రప్రదేశ్లోని పచ్చపార్టీ నిరుద్యోగులు ఆ దేవాలయాల్లోని పాలక మండలి పదవుల కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లోని పాలక మండళ్లలో తెలంగాణ పచ్చ తమ్ముళ్లను నియమిస్తే ఉరుకుంటారా అని ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుతమ్ముళ్లు తెగ చెవులు తెగ కోరికేసుకుంటున్నారు.