తిరుమల కోసం కమలదండు యత్నం
సూది కోసం సోదికెళ్తే సుడితిరిందా అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా తాడిపల్లిగుడెం నుంచి గెలుపోందిన ఆ పార్టీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు చంద్రబాబు కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టారు. అయితే దేవాదాయశాఖ మాకే దక్కింది కనుక టీటీడీ ఛైర్మన్ పదవి కూడా మాకే దక్కాలంటూ ఆ పార్టీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. అందుకోసం ఇప్పటికే కేంద్రంలోని తమ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలు తమ మంతనాలు తీవ్రతరం చేశారు.
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ అయిన కనుమూరి బాపిరాజు ఇప్పటికే రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఆగస్టుతో తన పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యం తనను రాజీనామా చేయవద్దంటూ ఆయన ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అనుమతించని పక్షంలో మీసాల రాజుగారు మరో నెల రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఖాళీ అయిన ఆ పదవిని ఎట్లా అయిన సొంతం చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు దృఢ సంకల్పంతో ఉన్నారు.
అందుకోసం కేంద్రమంత్రులతో ఇప్పటికి రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే టీడీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పదవి ఇటు టీడీపీ నేతలకా లేక బీజేపీ నేతలకు దక్కనుందా అనేది తేలాల్సి ఉంది.