మఖలో పుట్టి పుబ్బలో మాయం
సమైక్యాంధ్రకు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన్ని తలచుకోగానే గుర్తొచ్చేది మహాభారతంలోని ఉత్తరకుమారుడే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యం తెలుసుకుని కూడా ఆయన సీఎంగా ఉండగా... తన తుది శ్వాస ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ గొప్పలు పలికారు. పైలిన్ తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ ... పైలిన్ తుపాన్ ఆపలేకపోయినా విభజనను అడ్డుకుంటానంటూ ప్రకటించారు. అందులోభాగంగా రాష్ట్ర శాసనసభకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళయాన్లా వెనక్కి పంపిస్తానన్నారు. అలాగే చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కసరత్తు తుది రూపు దిద్దుకుంటున్న దశలో తాను ముమ్మాటికి సమైక్యవాది నంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారేశారు. అనంతరం విభజన జరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ను మళ్లీ సమైక్యంగా ఉంచేందుకు 'జై సమైక్యాంధ్ర పార్టీ' స్థాపించినట్లు ప్రకటించారు.
ఎన్నికలకు ముందే ఆ పార్టీలో అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఆయన సన్నిహితులు ఒక్కొక్కరుగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పారు. ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జెఎస్పీ ఒక్కటంటే ఒక్క సీటు కూడ గెలుచుకోలేక పోయింది. దాంతో ఆయన్ని నైరాశ్యం వెంటాడినట్లుంది. దాంతో పార్టీ వద్దు ఏమీ వద్దు అనుకున్నారో ఏమో మాదాపూర్లోని పార్టీ కార్యాలయంలో ఉన్న తట్టా బుట్టా కూడా సర్దేశారు. అది చేస్తా ఇది చేస్తా నంటూ కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోయింది.