
పడి లేచి... లేచి పడిన జయ
అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా దోషిగా తేలింది. హీరోయిన్గా అటు చలన చిత్రసీమలో, ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షరాలిగా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఇటు రాజకీయాలలో తనదైన ప్రముఖ పాత్ర పోషించిన జయలలిత జీవితంపై చిన్న కథనం....
నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి (సంధ్య)లు. సంధ్య పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో ఆమె బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. ఇక జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది.
అనంతరం జయలలిత చదువులో ప్రతిభ పాటవాలు కనబర్చడంతో ఆమెకు ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేసింది. మరోవైపు తల్లి నటిస్తున్న చిత్రాలలో జయలలిత కూడా నటిస్తుండేంది. అయితే ఆమె చదువుకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా దర్శకుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకుని నటింప చేసేది. ఆ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లీ అనే ఇంగ్లీషు చిత్రం 1961లో విడుదలైంది. హీరోయిన్గా కన్నడంలో మొట్టమొదట నటించిన చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన మనషులు మమతలులో నటించారు. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
1977లో ఎంజీ రామ్చంద్రన్ తమిళనాడుకు మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దాంతో ఆమె ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. అంతేకాదు సభలో ఆ పార్టీకి ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు.
1987లో రామచంద్రన్ మరణించారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. కాగా జనకీకి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ మె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
1989లో బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు 225 స్థానాలను కైవసం చేసుకుంది. ( రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికలు) .ఈ సమయలో ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. 2001లో మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయింది.
ఇంతలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుని... ఆ స్థానంలో మంత్రివర్గంలోని ఓ పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించింది. 2011లో ముచ్చటగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల వారి మనసులు చోరగోనేందుకు 'అమ్మ' పేరిట పలు సంక్షేమ పథకాలు చేపట్టింది. కానీ ఇంతలో బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా నిర్థారించింది.