సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు మాసం కోటా కింద మొత్తం 69,254 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు.
కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వివరించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని స్పష్టంచేశారు. దీనివల్ల గంట సమయం ఆదా అవుతోందని, తద్వారా దాదాపు 5 వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతోందని తెలిపారు. సమావేశంలో తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి, ఇన్‌చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
9 నుంచి ‘మనగుడి’
ఇదిలా ఉండగా.. ఈనెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాలల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 9న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60 కోట్లు వచ్చిందని ఈఓ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment