భక్తులకే తొలి ప్రాధాన్యం
► టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ
► సామాన్య భక్తుడిగానే తిరుమలతో అనుబంధమెక్కువ
► శ్రీవారి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో శ్రీవారి సేవా భాగ్యం
► ఉత్సవమూర్తి ఊరేగింపులో తొలిరోజే సింఘాల్ మార్క్
సాక్షి, తిరుమల: సామాన్య భక్తుడిగానే తరచూ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే సంప్రదాయముందని, ఆవిధంగా 1994 నుంచి తనకు తిరుమలతో అనుబంధముందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శనివారం ఆయన తిరుమల ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తాను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నపుడు తరచూ తిరుమలను సందర్శించే అవకాశం కలిగిందన్నారు.
శ్రీవారి దయ, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో టీటీడీ ఈవోగా సేవలందించే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. కాలిబాట, రూ.300 టికెట్లు, ఇతర సేవల్లో పాల్గొనే భక్తులందరికీ మెరుగైన దర్శనం కల్పించే ఏర్పాట్లు చేపడతానన్నారు. ఇప్పటికే అలాంటి చర్యలు అమలవుతున్నాయనీ, పెరుగుతున్న భక్తుల రద్దీని బట్టి మార్పులు చేస్తానన్నారు. మానవ సేవే, మాధవసేవగా విధులు కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు, సిబ్బందిని కలుపుకుని మెరుగైన సేవలు అందిస్తానన్నారు.
తొలిరోజే ఈవో సింఘాల్ మార్క్
అనిల్‌కుమార్ సింగాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తన మార్కు చూపించారు. శనివారం పద్మావతి పరిణయోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహన తిరుగు ప్రయాణంలో కల్యాణవేదికపై ఉండే భక్తులందరికీ ఉత్సవమూర్తులు కనిపించేలా అటు ఇటు తిప్పుతూ చూపించాలని ఆదేశించారు. ఆమేరకు పేష్కార్ రమేష్, డాలర్ శేషాద్రి, గురురాజా వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ భక్తులు అందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకునే వెసులుబాటు కల్పించారు.