ఆన్‌లైన్‌లో 44,896 ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడి
సాక్షి, తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి 44,896 సేవాటికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్న మయ్య భవనంలో గురువారం జేఈవో కేఎస్.శ్రీనివాస రాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతినెలా ఆర్జితసేవా టికెట్లు విడుదలైన నిమిషాల వ్యవధిలోనే అమ్ము డవుతున్నాయని, ఇంటర్నెట్ వేగంగా లేక రిజర్వు చేసు కోలేక పోతున్నామని భక్తుల నుంచి సూచనలు రావడంతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామన్నారు.
కొత్త విధానంలో సుప్రభాతం 6,985, తోమాల 90, అర్చన 90, అష్టద ళపాద పద్మారాధన 120, విశేష పూజ 1,125, నిజపాద దర్శనం 2,300 టికెట్లు కలసి మొత్తం 10,710 సేవాటికెట్లను లక్కీడిప్ విధానం ద్వారా కేటాయిస్తామన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ వరకు భక్తులు తమకు అవసరమైన టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో డిప్ తీస్తా మని, టికెట్లు పొందిన భక్తులకు ఎస్‌ఎంఎస్ లేదా ఈ–మొ యిల్‌లో సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు.
ఒకసారి సేవా టికెట్ పొందిన భక్తుడు తిరిగి 180 రోజుల తర్వాతే బుక్ చేసుకునే వీలవుతుందన్నారు. ఇక శ్రీవారి కల్యాణోత్సవం 8,250, ఊంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్స వం 9,030, సహస్ర దీపాలంకార సేవ 9,976 టికెట్లు.. మొత్తం 34,186 సేవా టికెట్లను పాత విధానంలో ఇంటె ర్నెట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు. జూలై 1 నుంచి గదులు ముందస్తుగా ఖాళీ చేస్తే కొంత నగదు తిరిగి చెల్లిస్తామన్నారు.
ఆనంద నిలయుడి దర్శనానికి ఆధార్
స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు ఆధార్ అనుసంధానం ద్వారా పారదర్శకమైన సేవలు అందించేం దుకు టీటీడీ సమాయత్తమవుతోంది. టీటీడీ తాజా లెక్కల ప్రకారం సగటున నిత్యం 72,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీనికి పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇలా దాదాపు 9 రకాలైన గుర్తింపు కార్డులను టీటీడీ అనుమతిస్తోంది. ఆధార్ మినహా ఇతర కార్డుల వల్ల భక్తుడి సమగ్ర వివరాలు తెలుసుకోవటం కష్టమవుతోంది. ఈ నేప థ్యంలో అన్నిరకాల దర్శనాలు, సేవలకు ఆధార్ అనుసం ధానం చేయటంతో తిరుమలకు ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎన్నిసార్లు దర్శించుకున్నారు? పొందిన సౌకర్యాలు, రోజులో ఎంతమంది వచ్చారు? తదితర వివరాలతో సమగ్ర వివరాలు సేకరించవచ్చని టీటీడీ భావిస్తోంది.
బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బు వాపస్
తిరుమలలో నేరుగా నగదు చెల్లించి గది పొందిన భక్తుల తోపాటు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నవారు గదుల బుకింగ్ రద్దు చేసుకున్నా, నిర్ణీత సమయం కంటే ముందుగానే ఖాళీ చేసినా ఆ మేరకు నగదు తిరిగి భక్తుల ఖాతాకు బదిలీ చేసే విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఆధార్‌తో దర్శనానికి ‘రేషన్’
తిరుమల, తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా ఐదువేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. దీంతో ఒకసారి వచ్చినవారు మూడు నెలల తర్వాతే తిరిగి శ్రీవారి దర్శనం పొందే అవకాశం ఉంది. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసే టికెట్ల కోటాకూ దీన్ని అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని భవిష్యత్‌లో అన్ని రకాల దర్శనాలకు అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది.