చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారిణి (డీఎస్‌ఓ) విజయరాణి హెచ్చరించారు. శుక్రవారం పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయాలపై కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పది ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ పెట్రోలు బంకుల యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫిర్యాదుల వివరాలు...
చిత్తూరులోని మిట్టూరు సమీపంలోని పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని, తద్వారా వాహనాలు పాడయి, మైలేజ్ రావడం లేదని ఒక ఫిర్యాదు అందింది.
చిత్తూరు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని సంతపేటకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
పుత్తూరులో మార్కెట్‌కు సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో ఫీడింగ్ కరెక్టుగా లేదని, రీడింగ్‌లో పైసలు తేడాలు ఉన్నాయని పుత్తూరుకు చెందిన అరుణ్ ఫిర్యాదు చేశారు.
వి.కోటలోని పేర్నంబట్ రోడ్డు ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టేటప్పుడు రీడింగ్ కనిపించడంలేదని, క ల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వి.కోటకు చెందిన రాజేష్ ఫిర్యాదు చేశారు.
శాంతిపురం పెట్రోల్ బంకులో వ్యాట్ మొత్తం ఎక్కువగా వసూలు చేస్తున్నారని కుప్పంకు చెందిన దేవరాజ్ ఫిర్యాదు చేశారు.
అరగొండ బస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నట్లు అరగొండకు చెందిన మునిరత్నం ఫిర్యాదు చేశారు. అలాగే తిరుపతి, చంద్రగిరిలోని పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదులు చేశారు.
కల్తీ పెట్రోలు విక్రయిస్తే కఠిన చర్యలు
Published Sat, May 23 2015 5:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM