కొలతల్లో మాయాజాలం
దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో మోసం
నిలువుదోపిడీకి గురవుతున్న వినియోగదారులు
తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే వారు మెజీషియన్లయితే.. చాలామంది వ్యాపారులు వారినే మించిపోతున్నారు. తూకంలో మాయాజాలంతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇంద్రజాలంలో సిద్ధహస్తులు ఉన్నదాన్ని లేనట్టు చేస్తే.. వీరు మాత్రం లేని బరువును ఉన్నట్టు చూపించి జనానికి టోకరా వేస్తున్నారు. తూనికలు కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్నారు.
యలమంచిలి : యలమంచిలి పట్టణంలోని ఓ చికెన్ దుకాణంలో శ్రీనివాసరావు అనే ఉద్యోగి కిలో చికెన్ కొన్నారు. బరువుతగ్గినట్టు అనుమానం రావడంతో మరో దుకాణం లో తూకం వేయిస్తే 900 గ్రాములే ఉంది... అనకాపల్లికి చెందిన శ్యామల ఓ చిల్లర దుకాణంలో రెండు కిలోల కందిపప్పు కొనుగోలు చేశారు. ఎలక్ట్రానిక్ కాటా తూకమే అయినా మోసం జరిగినట్టు అనుమానం వచ్చి మరో దుకాణంలో కందిపప్పును తూకం వేయించారు. 100 గ్రాములు తగ్గడంతో వ్యాపారితో తగాదాకు దిగారు. మనలో ప్రతి ఒక్కరికీ ఇలాటి అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయితే తెలియక కొంత, తెలిసినా అడిగే తీరిక లేక కొంత.. ఉదాసీనత వల్ల కొంత.. మొత్తం మీద చాలా సందర్భాల్లో ఈ మోసాలు మరుగున పడిపోతూనే ఉంటాయి. దీంతో పలువురు వ్యాపారులు ఇదో ఆనవాయితీగా మోసం చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, రేషన్‌షాపు దగ్గర నుంచి పండ్లు, మాంసం, కూరగాయలు, వస్త్రాలు, చివరకు బంగారం వస్తువులు కూడా కొలతల ప్రకారం అమ్మాల్సిందే. అయితే అమ్మకాల్లో నమ్మకం కొరవడుతోందనివినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా పద్ధతిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంకుల్లో బాదుడు
పెట్రోల్ బంకుల పంపుల్లో తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణలోనే కొలతలు నిర్ధారించాలి. చాలా చోట్ల వీరు వెళ్లకుండానే బంకు యజమానులు ఇష్టానుసారం ఖరారు చేస్తున్నారు. లీటరు పెట్రోల్, డీజిల్ వేయడానికి కొలతలు నమోదు చేసేటప్పుడు 50 నుంచి 100 మి.లీ. తక్కువ పడేలా నమోదు చేస్తున్నట్టు బంకుల్లో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు.
దోపిడీ తీరిలా..
రెండేళ్లకోసారి కాటాలు, తూకంరాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే ఉండడం లేదు. కొందరు రేషన్ షాపుల నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాటాలను పక్కనపెట్టి పాత రాళ్లను వినియోగిస్తున్నారు. రెండేళ్లకిందట అమలులోకి వచ్చిన ప్యాకింగ్ కమోడిటీస్ చట్టం నూతన నిబంధనల ప్రకారం ప్రతివస్తువును ప్యాకింగ్ చేసి విక్రయించాలి. వాటిపై తయారు చేసిన తేది, నికర బరువు, ధర, ఎప్పటిలోగా వినియోగించాలనే వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ పద్ధతిని పాటించేవారే లేరన్నది విస్పష్టం.
నామమాత్రంగా కేసులు
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 30వేలు ఉన్నాయి. వీటిపై 2014-15 ఆర్ధిక సంవత్సరంల ో ఇప్పటి వరకు కేవలం 300 కేసులు నమోదు చేసి రూ.11లక్షలు అపరాధ రుసుము కింద వసూలు చేశామని ఆ శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ థామస్ రవికుమార్ తెలిపారు. తన పరిధిలో 34 మండలాల్లో అనకాపల్లి, నర్సీపట్నం ఇన్‌స్పెక్టర్లు కూడా తనిఖీ చేస్తారని తెలిపారు. వినియోగదారులు మోసాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
నమ్మకమివ్వని అమ్మకం
Published Thu, Dec 24 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement