ఇక పాత నోట్లకు పెట్రోల్ నో | For Old 500-Rupee Notes At Petrol Pumps | Sakshi
Sakshi News home page

ఇక పాత నోట్లకు పెట్రోల్ నో

Published Fri, Dec 2 2016 1:41 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

ఇక పాత నోట్లకు పెట్రోల్ నో - Sakshi

ఇక పాత నోట్లకు పెట్రోల్ నో

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో రూ. 500 నోట్లు చెల్లవు
► మిగతా అనుమతించిన సేవలకు వాడుకోవచ్చన్న కేంద్రం
► నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు
► రూ. 200 మించితేనే పాత 500 నోటుకు అనుమతి  

న్యూఢిల్లీ: డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకూ పాత నోట్లు వాడుకోవచ్చని గతవారం ప్రభుత్వం పేర్కొన్నా... కొన్ని చోట్ల ఈ సౌకర్యం దుర్వినియోగం అవుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

అన్ని టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లు(పీవోఎస్)లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులతో టోల్ చెల్లించవచ్చని, టోల్ రూ. 200 కంటే ఎక్కువుంటే పాత రూ. 500 నోటును అనుమతిస్తారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి  ఫాస్టాగ్‌‌స(ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొనుగోలు చేసి టోల్ చెల్లించవచ్చని, నగదు చెల్లింపులు చేసేవారు... ఆలస్యం కాకుండా చిల్లర దగ్గర పెట్టుకోవాలని సూచించింది. టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 15 అర్ధరాత్రి వరకూ పాత 500 నోట్లు తీసుకుంటారని, పాస్టాగ్‌‌స కొనుగోలుకు, 200 కంటే టోల్ ఎక్కువుంటేనే పాత 500 నోట్లను స్వీకరిస్తారని తెలిపింది. ఫాస్టాగ్‌‌స వాడితే టోల్ ఫీజు నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇస్తారని, ఈ వాలెట్ల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని పేర్కొంది. ఆయిల్, గ్యాస్ కంపెనీలు డిజిటల్ చెల్లింపులకు విసృ్తత ఏర్పాట్లు చేశాయని, అందుకే పెట్రోల్ బంకుల్ని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్లకు మాత్రం పాత 500 నోట్లు తీసుకుంటారని కేంద్రం స్పష్టం చేసింది.

90 శాతం ఏటీఎంల్లో మార్పులు
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2 లక్షలకుపైగా ఏటీఎంల్లో 90 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌‌స ఎండీ తెలిపారు. నవంబర్ 30 లోపు అన్ని ఏటీఎంల్లో మార్పులు పూర్తయ్యేలా ఆర్బీఐ నియమించిన టాస్క్‌ఫోర్స్‌కు గడువునిచ్చారని, 1.80 లక్షల ఏటీఎంల్లో కొత్త 2 వేలు, 5 వందల నోట్లు వచ్చేలా మార్పులు పూర్తయ్యాయని చెప్పారు. నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తల విషయంలో బ్యాంకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్లో పొందుపరిచిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
 
జీతం కోసం క్యూలో అష్టకష్టాలు
ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం గురువారం బ్యాంకుల ముందు భారీ క్యూలతో తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే నగదుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని బ్యాంకులు చెప్పినా వాస్తవంగా ఆ పరిస్థితులు కన్పించలేదు. వారానికి రూ. 24 వేలు విత్‌డ్రా పరిమితి ఉన్నా ఒక వ్యక్తికి కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రాకు అనుమతించారు. మరికొన్ని చోట్ల రూ. 10 వేలు, రూ. 12 వేల చొప్పున విత్‌డ్రా సౌకర్యం కల్పించారు. ఇక దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ఏటీఎంలు నగదు లేక మూతబడ్డాయి. దాదాపు 90 % ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. పనిచేసిన ఏటీఎంల్లో ఎక్కువ శాతం రూ. 2 వేల నోట్లే వచ్చాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదు: జైట్లీ
నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందన్న భయాల్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ బిల్లు ప్రస్తుత విధానాల్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీ పరిమాణం గణనీయ స్థాయిలో పెరుగుతుందని భువనేశ్వర్‌లో నిర్వహించిన మేకిన్ ఒడిశా సదస్సు సందర్భంగా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఆర్థిక పరిస్థితి సమీక్షించేందుకు ఆర్‌బీఐ గవర్నర్, ఇతర ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పిలవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. జనవరిలో ఈ భేటీ ఉంటుందని కమిటీ ఛైర్మన్ థామస్ చెప్పారు.
 
బెంగళూరులో రూ. 6 కోట్ల స్వాధీనం

బెంగళూరులో ఐటీ అధికారులు ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారి జయచంద్ర ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్ల కట్టలే ఎక్కువగా ఉన్నాయని, వాటి విలువ రూ.4.7 కోట్లు ఉండొచ్చని తెలిసింది. జయచంద్ర స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. దాదాపు 14 కిలోల బంగారు, వెండి నగలు, వస్తువులతో పాటు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement