108 ఇం‘ధన’ సమస్యలు
• వాహనాలకు డీజిల్ నింపలేమని తేల్చిచెబుతున్న పెట్రోల్ బంకులు
• రుణ అర్హతను కోల్పోయారంటూ స్పష్టీకరణ
• 50 రోజులుగా పైసా నిధులివ్వని సర్కారు
సాక్షి, అమరావతి
ఆపదలో ఆదుకునే 108 వాహనాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే అనేక వాహనాలను మూలనపడేసిన సర్కారు.. చివరకు డీజిల్ పట్టించుకునేందుకు రుణ అర్హతను కోల్పోయేలా చేసింది. ప్రభుత్వం ఎప్పుడైనా నిధులు జాప్యం చేసినప్పుడు నిర్వహణ సంస్థే పెట్రోలు బంకులకు అప్పుగా డీజిల్ నింపాలని లేఖ ఇచ్చేది. నిర్వహణ సంస్థపై నమ్మకం, సర్కారు వాహనాలే కదా అనే భరోసాతో నెలరోజుల పాటు పెట్రోలు బంకుల యజమానులు వాహనాలకు అప్పుగా డీజిల్ పోసేవారు. అయితే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో డీజిల్ పొయ్యడానికి బంకుల యజమానులు నిరాకరిస్తున్నారు.
ఇరవై రోజులుగా మీరు రుణ అర్హత కోల్పోయారని తేల్చిచెబుతుండడంతో 108 వాహనాలు నడుపుతున్న పైలెట్లు తెల్లముఖం వేస్తున్నారు. అవగాహనా ఒప్పందం ప్రకారం ఒక్కో త్రైమాసికానికి ముందస్తుగానే నిర్వహణ సంస్థకు నిధులివ్వాలి. కానీ జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. నిధులున్నా చెల్లింపులు చేయడం లేదు. ఫైలు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వద్దే ఉంది. వాహనాలు ఆగిపోతున్నా, ఉద్యోగులకు జీతాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్‌తోనే జీవీకే సంస్థకు నిర్వహణ కాలం ముగిసింది. అయితే ప్రభుత్వం అర్హత లేని కొత్త సంస్థకు టెండర్లు దక్కేలా చేయడంతో జీవీకే కోర్టుకు వెళ్లింది.
దీంతో ఆ కొత్త సంస్థకు అర్హత లేదంటూ మళ్లీ జీవీకేకే బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను ఎలా తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు పలువురు అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. మరోవైపు 108కు కాల్ చేస్తే చాలా చోట్ల జాప్యం జరుగుతుండటంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని ఆస్పత్రులకు వెళుతున్నారు.