నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో గ్రామరెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్షలను ఆదివారం పకడ్బందీగా నిర్వహించాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో 48 వీఆర్‌ఓ పోస్టులకు 35,608 మంది, 145 వీఆర్‌ఏ పోస్టులకు 2,352 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల నుంచి తప్పనిసరిగా వేలి ముద్రలను తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణపై వీడియో తీయాలన్నారు. మొత్తం 36 రూట్లలో 36 మంది ఆఫీసర్లను నియమించామని చెప్పారు. కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా డీఆర్‌ఓ రామిరెడ్డి, అసిస్టెంట్ కో ఆర్డినేటర్లగా ఆర్డీఓలు వ్యవహరిస్తారన్నారు.
అలాగే 26 మంది అబ్జర్వర్లు, 94 మంది లైజనింగ్, చీఫ్ లైజనింగ్ అధికారులను నియమించినట్టు జేసీ తెలిపారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్‌ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రామిరెడ్డి, ఏపీపీఎస్‌ఈ సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు
Published Sat, Feb 1 2014 3:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement