నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కౌలురైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్ల అలసత్వం తగదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం సాయంత్రం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి కౌలురైతులు రుణాల కోసం కలెక్టరేట్‌కు వచ్చారన్నారు. అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంవల్లే కౌలురైతులకు రుణాలు మంజూరుకావడంలేదని మండిపడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు 3261 మంది కౌలురైతులకు రూ.12.93కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండురోజుల్లోగా తహశీల్దార్లు అన్ని బ్యాంక్‌ల శాఖలకు వెళ్లి బ్యాంకర్లతో సంప్రదించి రుణ లక్ష్యాలను అధిగమించాలన్నారు.
నెలాఖరులోగా రూ.50కోట్లు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో త్వరలో ఏడో విడత భూ పంపిణీ జరగనుందన్నారు. అన్నినియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులతో సమావేశమై లబ్ధిదారుల జాబితాను వెల్లడించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వభూమిని గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వభూమి ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ గౌతమి, ఆర్డీవోలు సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, రమణ, మధుసూదన్‌రావు, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
రుణాల మంజూరులో అలసత్వం తగదు
Published Wed, Dec 18 2013 4:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement