అరసవల్లి, న్యూస్‌లైన్: పర్మిట్లు లేకుండా నడుస్తున్న వాణిజ్య వాహనాలకు ముకుతాడు వేయడానికి రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ప్రత్యేక దాడులు చేయనున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దాడులు చేయనున్నట్లు తెలిపారు. వాణిజ్య వాహనాలు, టాక్సీలు, బస్సులు తదితర వాహనాల పర్మిట్లు తనిఖీ చేస్తామన్నారు. పర్మిట్ లేకపోయిన, పన్ను చెల్లించకపోయిన సంబంధిత వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ బస్సులతో పాటు ఇతర వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా, అర్హులైన డ్రైవర్లు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు. జిల్లాలో రెండు బస్సులకు మాత్రమే రూట్ పర్మిట్లు ఉన్నాయని, వాటిని ఇప్పటికే తనిఖీ చేశామని తెలిపారు.
శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రంతాలకు నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడిపితే వెంటనే సీజ్ చేస్తామన్నారు. అలాగే లగేజీ తీసుకువెళ్లే వాహనాల్లో ప్రయాణి కులను తీసుకువెళితే సహించేది లేదని చెప్పారు. ప్రవేటు బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వోల్వో బస్సుల్లో ప్రయాణికులను తీసుకువెళ్లే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవరసర పరిస్థితిల్లో ఏం చేయాలన్న విషయాలు పూర్తిగా తెలియ జేయాలని ట్రావెల్సె వారికి తెలిపినట్లు చెప్పారు. ప్రయాణికుడి పూర్తివివరాలు, సెల్ నంబరు ఖచ్చితంగా ఉండాలని వారికి చెప్పినట్లు వివరించారు.