పరిశ్రమలకు ప‘వర్రీ’
- విద్యుత్ సమ్మెతో పరిశ్రమలు విలవిల
- ఫార్మా, ఐటీ, సెజ్‌లకు దెబ్బ
- పారిశ్రామిక రంగానికి తొలిరోజు నష్టం రూ.97 కోట్లు పైమాటే
పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. ఐటీ కంపెనీలు తాత్కాలిక సెలవు ప్రకటించాయి. నీటి సరఫరా లేక ఫార్మా కంపెనీలు మూతపడుతున్నాయి. దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని సుమారు 32 కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. స్టీల్‌ప్లాంట్‌లోనూ ఇదే పరిస్థితి. విద్యుత్ ఉద్యోగుల సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరడంతో ఈ దుస్థితి నెలకొంది. దీని వల్ల పరిశ్రమలకు భారీగానే నష్టం వాటిల్లింది.
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సమ్మె రెండో రోజుకు చేరడంతో జిల్లా పారిశ్రామిక రంగం కావికలమవుతోంది. అత్యంత కీలకమైన ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సెజ్‌లకు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా సరఫరాలేకపో వడంతో కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి.
ఆదివారం నుంచే విద్యుత్ సమ్మె ప్రారంభమైనప్పటికి సెలవురోజు కావడంతో కంపెనీలకు పెద్దగా ఇబ్బందిలేకపోయింది. కానీ సోమవారం ఉదయం నుంచే విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో అనేక రంగాలు విలవిలలాడి పోయాయి. ఒకపక్క సరఫరా నిలిచిపోగా, మరోపక్క సొంత విద్యుత్‌తో నిరంతరాయంగా ఉత్పత్తి చేపట్టలేక అనేక సంస్థలు తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపివేశాయి.
అంతా కుదేలు
24గంటలు విద్యుత్ అవసరమైన ఐటీ రంగానికి సోమవారం ఉదయం నుంచే సరఫరా నిలిచిపోయింది. దీనిప్రభావం నగరంలోని 70 ఐటీ కంపెనీలపై పడింది. రుషికొండ హిల్‌తోపాటు మొత్తం నాలుగు ఎస్‌ఈజెడ్‌లకు సరఫరా లేదు. దీంతో కొంతసేపు ప్రత్యామ్నాయ విద్యుత్‌పై కంపెనీలు నడిపించారు. కానీ సరఫరా రాకపోవడంతో ఉద్యోగులకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. నగరం నడిబొడ్డున ఉన్న హెచ్‌ఎస్‌బీసీ, మహీంద్రా సత్యం, విప్రో తదితర ఐటీ కంపెనీలు కూడా ఇదే సమస్యతో సతమతమయ్యాయి.
ఫార్మా రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పరవాడలోని ఫార్మా ఎస్‌ఈజెడ్‌లో మొత్తం 54 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి ఉదయం నుంచే విద్యుత్ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనంతో ప్లాంట్లను నడిపించాయి. నిరంతరంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌తో కంపెనీలను నడపడం కష్టం కావడంతో సెజ్‌లో దాదాపు కంపెనీలన్నీ ఉత్పత్తిలో కోత విధించాయి. ఫార్మా ఎస్‌ఈజెడ్‌కు ఏలేరు కాలువ నుంచి నిత్యం నీటి సరఫరా అవుతుండగా విద్యుత్ లేక సోమవారం సరఫరా ఆగిపోయింది. దీంతో కంపెనీలు నిర్వహణపరమైన పనులకు నీరు లేక నిలిచిపోయాయి.
దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో సుమారుగా 32 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో ఐటీ, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలు అనేకం విదేశీ ఎగుమతులకు సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్నాయి. వీటికూడా సరఫరా నిలిచిపోయింది. ఉదయం 11.30 గంటల వరకు సరఫరా ఆగిపోగా, ఆ తర్వాత కొంతసేపు వచ్చింది. తిరిగి మూడు గంటల నుంచి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పెద్ద కంపెనీలు సొంతంగా ఉత్పత్తి నడిపిస్తుంటే, మధ్యతరహా కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయి. దీంతో వేలాది కార్మికులకు పనిలేకుండా పోయింది.
చిన్న, మధ్యతరహా కంపెనీలు జిల్లాలో 1200కుపైగా ఉన్నాయి. వీటిలో ఏపీఐఐసీ ఐలాలో 900 కంపెనీలున్నాయి. గాజువాక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 50 కంపెనీలున్నాయి. వీటికి ఉదయం నుంచి విద్యుత్ లేదు. సగానికిపైగా పరిశ్రమలకు సొంత విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఇవన్నీ మూతపడ్డాయి. దీంతో కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితీ అంతే. వీటికికూడా ఉదయం నుంచి విద్యుత్ లేదు. దీంతో ఒక్క కలెక్టరేట్‌కు మినహా మిగిలిన వాటికి సొంత విద్యుత్ వనరు లేకపోవడంతో కార్యాలయాలన్నీ చీకటిమయమైపోయాయి. జిల్లా అధికారులు చీకట్లోనే విధులు నిర్వహించగా, మరికొందరు చేసేదిలేక ఇళ్లకు వెళ్లిపోయారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్‌కూ సమస్యలు తప్పలేదు. వీటికి భారీస్థాయిలో సొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నప్పటికీ విద్యుత్ సమ్మె కారణంగా సరఫరా లేకపోవడంతో సోమవారం అంతా ప్రత్యామ్నాయ విద్యుత్‌పైనే ఆధారపడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
మొత్తం మీద జిల్లాలో తొలిరోజు ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్, భారీ కంపెనీలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో విద్యుత్ సరఫరా లేక ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు రూ.98 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు పారిశ్రామిక వర్గాలు అంచనా వేశాయి. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నష్టం తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పవర్ హాలిడే సమస్య ఇంకా కొనసాగుతుండడం, మరోపక్క సమ్మె వల్ల నష్టం పెరగడంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది.
రైల్వే రంగంపై విద్యుత్ సమ్మె ప్రభావం ఏమాత్రం లేకున్నా ముందస్తు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం కోటా నుంచి నిరంతరం సరఫరా జరుగుతున్నా ఒకవేళ గ్రిడ్ దెబ్బతింటే ఒడిశా నుంచి తమకు విద్యుత్ నిరంతరంగా అందుబాటులో ఉండే లా ఒడిశాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.