మద్యం పాలసీపై మల్లగుల్లాలు | Struggled on alcohol policy | Sakshi
Sakshi News home page

మద్యం పాలసీపై మల్లగుల్లాలు

Published Tue, May 12 2015 4:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మద్యం పాలసీపై మల్లగుల్లాలు - Sakshi

మద్యం పాలసీపై మల్లగుల్లాలు

‘ఎక్సైజ్’పై సీఎం సమీక్ష
 
హైదరాబాద్: జూలై 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏ తరహా మద్యం పాలసీ అమలు చేయాలన్న అంశంపై గత రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రాలేదు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలోనూ మద్యం పాలసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు, కర్ణాటక మద్యం పాలసీలపై ప్రధానంగా చర్చ జరిగినా.. ప్రభుత్వం, అధికారుల నడుమ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మద్యం షాపుల నిర్వహణకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని ఎక్సైజ్ అధికారులకు బాబు సూచించారు. మళ్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్టు విధానంలో 15 వేల మందిని నియమించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మద్యం కల్తీ వంటి వాటిని నిరోధించేందుకు హోలోగ్రామ్, బార్ కోడింగ్ విధానం పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు కొనసాగించాలన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.12,258 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యమని పేర్కొన్నారు.

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు మార్గాలను అన్వేషించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆదాయ వనరుల శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
పథకాల బాధ్యత నేతలదే

 గత ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పింఛన్ పథకం, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నీరు- చెట్టు, ఈ-పాస్ విధానం, స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు తదితరాల గురించి ప్రజలతో వివరించాల్సిందిగా సూచించారు. సోమవారం చంద్రబాబు వివిధ స్థాయిలోని ఐదు వేల మంది నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
నేడు మంత్రివర్గ సమావేశం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. సచివాలయంలో ఎల్ బ్లాక్‌లో చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది.

14న వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీలన..

ఈ నెల14న  చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు.
 బాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు రూ.5 కోట్లు
 - ఆర్టీసీ నిధుల నుంచి కేటాయింపు
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ నుంచి రూ.5.05 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించేందుకు వీలుగా రూ.5.05 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు చేయాలని జూలై 16, 2014న ప్రభుత్వం నిర్ణయించింది. చంఢీఘడ్‌లోని జేసీబీఎల్ సంస్థ నుంచి బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసేలా టెండర్‌ను ఖరారు చేసింది. బస్సు కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టెండర్ ఒప్పందంలో భాగంగా జేసీబీఎల్ సంస్థకు అడ్వాన్సు కింద రూ.1,26,25,000లను మార్చి 26న ఏపీఎస్ ఆర్టీసీ చెల్లించింది. రెండో, మూడో విడతల కింద రూ.2,52,50,000లను విడుదల చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 లాభసాటిగా సేద్యం


వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా కృషి చేయాలని వ్యవసాయాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రైతుకు ఏడాదికో, ఆర్నెల్లకో ఆదాయం వచ్చేటట్లు కాకుండా ప్రతినెలా ఏదో ఒకరకమైన వ్యవసాయాదాయం వచ్చేలా విధానాలు రూపొందించాలని సూచించారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ ప్రణాళికతో పాటు గతేడాది సాధించిన ఫలితాలపై సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఖరీఫ్‌పై వ్యవసాయశాఖ సంసిద్ధతను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడులు తగ్గే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలోని ఓ ఆదర్శరైతు క్రిమిసంహారక మందులు వాడకుండా అత్యధిక దిగుబడి సాధించి, ఎకరాకు 25వేల ఆదా చేశారని గుర్తు చేశారు.
 
ఏపీలో నైపుణ్య అకాడమీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిబిషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ విభాగంలో నైపుణ్య శిక్షణ అందించే అకాడమీ ఏర్పాటుకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఎగ్జిబిషన్స్ అండ్ ఈవెంట్స్(ఐఏఈఈ) ముందుకొచ్చింది.  ఐఏఈఈ ప్రెసిడెంట్ డేవిడ్ ద్వా సోమవారం సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement