పెడన రూరల్, న్యూస్‌లైన్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పాలిటెక్నిక్ విద్యార్థి పండ్రాజు సాంబశివరావు (20) దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని ఉరివి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. సంక్రాంతి పండుగ రోజునే ఇంట్లో విషాద సంఘటన జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.
సేకరించిన వివరాల ప్రకారం... ఉరివి గ్రామానికి చెందిన పండ్రాజు సూరిబాబు అనే రైతుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడైన సాంబశివరావు గుడ్లవల్లేరులోని ఏఏఎన్ అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంట్లోని విద్యుత్ మెయిన్‌ను ఆఫ్ చేసి, గొడ్లచావిడిలో సీలింగ్ ఫ్యాన్‌ను బిగించబోయాడు.
అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇన్‌వర్టర్‌ను ఆఫ్ చేయలేదు. దీంతో ఫ్యాన్ బిగిస్తున్న సమయంలో ఇన్‌వర్టర్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో సాంబశివరావు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలను వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటిని సాంబశివరావును ముదినేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సాంబశివరావు మృతిచెందినట్లు ప్రకటింటంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు.
పండుగపూట ఇంట్లో విషాద ఘటన జరగడంతో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. కుమారుడి మృతదేహం వద్ద అతని తల్లి జ్యోతి రోదిస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. గ్రామ సర్పంచి దొండపాటి గంగాలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోన భూషయ్య, ఎస్సీ నాయకుడు చిన్నం శివ తదితరులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం ఉదయం ఉరివి గ్రామంలో సాంబశివరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మృతుడి సహచర విద్యార్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
విద్యుదాఘాతానికిగురై విద్యార్థి మృతి
Published Thu, Jan 16 2014 6:25 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement