
అధ్యాపకుల వేధింపులతో విద్యార్థిని మృతి
తాను చదువుతున్న విద్యాసంస్థకు చెందిన సిబ్బంది వేధింపులకు పాల్పడటంతో.. వాటిని భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొన్ని గంటల పాటు కొట్లాడి.. చివరకు ప్రాణాలు వదిలేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలోని గుత్తికొండ శ్రీరాములు డీఈడీ కళాశాలలో చదువుతున్న సుభాషిణి అనే విద్యార్థిని టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తోంది. అక్కడ కొంతమంది అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆమెను వేధించారు.
ఆ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. విద్యార్థిని పరిస్థితి విషమించడంతో ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా, అధ్యాపకులు, సహ విద్యార్థుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు అంతకుముందు పోలీసులకు తెలిపింది. తనకు టీచర్ కావాలని చాలా ఆశగా ఉండేదని, అంతా కలిసి వేధించి ప్రాణాలు పోయేలా చేశారని వాపోయింది.