తిరుపతి ఎస్వీయూలో ఘోర తప్పిదం! | Student Suicide For SV University Mistakes | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎస్వీయూ అధికారుల ఘోర తప్పిదం!

Published Wed, Aug 21 2019 8:32 AM | Last Updated on Wed, Aug 21 2019 5:54 PM

Student Suicide For SV University Mistakes - Sakshi

ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన

ఎస్వీయూ పరీక్షల విభాగం చాలా కాలం నుంచి సమస్యల్లో ఉంది. ఈ విభాగంలో నిత్యం ఏవో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లడం క్యాంపస్‌లో హాట్‌ టాఫిక్‌గా నిలిచింది. ఎక్కువమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఇదే సమయంలో పుత్తూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి హరి(19) రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల విభాగం తప్పువల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందులో నిజం లేదని ఎస్వీయూ అధికారులు చెపుతున్నారు. ఫలితాల తప్పు వ్యవహారంలో ఇప్పటికే నల్గురు ఉద్యోగులకు మెమో జారీచేశారు. ఈ అంశంపై లోతైన విచారణ జరపాలని, సంబంధిత ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్‌(చిత్తూరు) : ఎస్వీయూలో ఏప్రిల్, మేనెలలో నిర్వహించిన రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు శనివారం రాత్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ మార్కులు విడివిడిగా ఉంటాయి. ఇంటర్నల్‌ మార్కులను సంబంధిత కళాశాలలు పంపుతాయి. ఎక్స్‌టర్నల్‌ మార్కులను యూనివర్సిటీలో మూల్యాంకనం చేయిస్తుంది. ఫలితాల విడుదల సమయంలో రెండింటినీ కలిపి ఫలితాలు విడుదల చేస్తారు.  శనివారం రాత్రి విడుదల చేసిన రెండో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను చూసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫెయిల్‌ కావడంతో లబోదిబోమంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ మార్కులు కొంత మందికి కలపలేదు. కొంతమందికి సంబంధించిన ఇంటర్నల్‌ మార్కులు కలపలేదు. ఇంగ్లిషు సబ్జెక్ట్‌కు సంబంధించి సుమారు 270 మందికి ఇంటర్నల్‌ మార్కులు కలుపకపోవడం వల్ల ఫెయిల్‌ అయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రాక్టికల్‌ మార్కులు కలపకపోవడం వల్ల కొంతమందికి గైర్హాజర్‌ అని వచ్చింది. దీనిపై ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులు సోమ, మంగళవారాల్లో ఆందోళన చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనలు చేపట్టాయి.

విద్యార్థి ఆత్మహత్య 
డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో పుత్తూరుకు చెందిన విద్యార్థి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్షల విభాగం తప్పిదం వల్లే విద్యార్థి ఫెయిల్‌ అయ్యాడని, అందుకే ఆత్మహత్మకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ సంఘటనకు బా«ధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాలు మంగళవారం పరిపాలన భవనం ఎదుట నిరసన తెలిపాయి. ఈ సంఘటనపై పూర్తిస్థాయి జరపాలని పట్టుబడుతున్నాయి.

నలుగురికి మెమో
ఎస్వీయూ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లిన సంఘటనకు సంబంధించి నలు గురు ఉద్యోగులకు మెమో ఇచ్చారు. ఒక అసిస్టెం ట్‌ రిజిస్ట్రార్, సూపరిండెంట్, ఇద్దరు క్లర్క్‌లకు మె మో జారీ చేశారు. కాగా ఈ సంఘటనపై విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఆత్మహత్మకు సంబంధంలేదు
పరీక్షల్లో ఫెయిల్‌ అయి చనిపోయిన విద్యార్థి హరి ఆత్మహత్యకు, సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో దొర్లిన  తప్పులకు ఎలాంటి సంబంధం లేదు.   రికార్డులు పరిశీలించాం. హరికి ఇంటర్నల్‌ మార్కులు కలిపి ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి.  పరీక్షల విభాగం తప్పు ఎంతమాత్రం లేదు.
–ఏ.సునీత, పరీక్షల నియంత్రణాధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement