వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
హైదరాబాద్ : ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనపై విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వైఎస్ జగన్ హామీలతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
కాగా వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్ జగన్ తొమ్మిది పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 500 చొప్పున కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 750 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ. 1500 ఇస్తామన్నారు.
ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. వెయ్యి చొప్పున ఇద్దరికి రూ. 2వేలను నేరుగా తల్లులకే ఇస్తామని వెల్లడించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్' పథకంపై వరాల జల్లు కురిపించిన ఆయన, ఇంజినీరింగ్ కాలేజిల ఫీజులను పూర్తి స్ధాయిలో ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
అలాగే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది.