
సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్న!
- ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తారు?
- సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం, ఉద్రికతత
విజయవాడ: విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ పలు విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళన బాట పట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగాన్ని ఎప్పుడిస్తారని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ.. ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులను పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు ఈ సందర్భంగా విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తారని సీఎంను సూటిగా ప్రశ్నించారు.