
నవోదయ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం:విద్యాశాఖ నిర్వాకం చిన్నారి విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష తేదీ ఇప్పుడు వారిలో గందరగోళానికి కారణమవుతోంది. నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు ఐదో తరగతి విద్యార్థులు అర్హులు. జవహర్ నవోదయ సమితి దేశవ్యాప్తంగా ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. తొలుత ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఈ పరీక్ష తేదీని ప్రకటించింది. కానీ సాంకేతిక, పరిపాలన కారణాల వల్ల దీనిని ఈనెల 21కి వాయిదా వేసింది. ఈనెల 18 నుంచి 21 వరకు ఐదో తరగతి వార్షిక (సమ్మెటివ్–2) పరీక్షలు జరగనున్నాయి. 21వ తేదీన పరిసరాల విజ్ఞానం సబ్జెక్టు ఆఖరి పరీక్ష ఉంది. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు రాయాల్సి ఉంటుంది.కానీ అదే రోజు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తుండడంతో ఆ పరీక్షకు హాజరయ్యే ఐదో తరగతి పిల్లల్లో తీవ్ర అలజడి రేగుతోంది. నవోదయ ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు ఉంటుంది. దీంతో ఈ రెండు పరీక్షల్లో ఏదో ఒక దానినే రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కోచింగ్ సెంటర్లలో కుస్తీ
జిల్లా వ్యాప్తంగా నవోదయ ప్రవేశ పరీక్షకు దాదాపు 40 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సీటు కోసం కష్టపడి చదువుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు వార్షిక పరీక్షలకు, ఇంటి వద్ద తల్లిదండ్రులు నవోదయ పరీక్షకు ఈ చిన్నారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖ నిర్వాకంతో వీరు కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒకే రోజు రెండు పరీక్షలకు ఎలా నిర్వహిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఆఖరి పరీక్ష వాయిదా వేయాలి
ఐదో తరగతి ఉత్తీర్ణత కాకపోతే ఆరో తరగతి నవోదయలో చేరడానికి అర్హత ఉండదు. అందువల్ల ఐదో తరగతిలో అన్ని పరీక్షలు రాసి ఉత్తీర్ణత కావలసి ఉంటుంది.ఈ పరిస్థితుల్లో 21న జరిగే ఐదో తరగతి ఆఖరి పరీక్షకు వీరు విధిగా హాజరు కావల్సిందేనన్నమాట! ఈ పరిస్థితుల్లో ఐదో తరగతి ఆఖరి పరీక్షను 21కి బదులు మరో రోజుకు వాయిదా వేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
నవోదయ ప్రవేశ పరీక్ష తేదీ, ఐదో తరగతి ఆఖరి పరీక్ష ఈనెల 21నే వచ్చింది. ఇది ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందే. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం.– లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment