విద్యాహక్కు చట్టానికి తూట్లు
► ఆదర్శపాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు ప్రకటన
► నిబంధనలు అతిక్రమణ అని విమర్శలు
► కోర్టును ఆశ్రయించే దిశగా ట్రస్మా ప్రతినిధులు..!
సిరిసిల్ల ఎడ్యుకేషన్ : విద్యాహక్కు చట్టాన్ని విధిగా పా టించాల్సిన ప్రభుత్వ విద్యాశాఖ దానిని తుంగలో తొక్కుతుంది. ప్రతీ యేటా సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. నవోదయ సీట్ల భర్తీకి ప్రతీ సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న తీరును ఈ విద్యాసంవత్సరం ఆదర్శ పాఠశాలలకు ఆపాదించింది. ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు, మెరిట్ జాబితా అనే వివిధ నిబంధనలు పెట్టింది. బడిలో చేరడానికి విద్యార్థి చాలు అనే దానికి మెరిట్ విధానాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సిన వచ్చిందన్న దానికి ఏఅధికారి జవాబులివ్వరు. ఇది ఏరకమైన చర్య అని పలు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం ఏం చెబుతుందంటే.
విద్యాను అందరికి అందించాలనే సంకల్పంతో భారత మానవ వనరుల శాఖ 2009 విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం విద్యార్థుల భౌతికంగా హింసించరాదని, అలాగే అనుమతి లేకుండా పాఠశాలలో నిర్వహించరాదని, బడీడు పిల్లలను బడిలో చేర్చుకోవడానికి ఏలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని చాలా స్పష్టంగా ఉంది. దీంతోపాటు విద్యార్థులకు అనువుగా అనేక విషయాలను చట్టంలో పొందుపరిచిన దానిని అమలు మాత్రం నిరాశజనకంగానే ఉంది.
ప్రవేశ పరీక్షకు ఫీజులు పెట్టారు
బడీడు పిల్లలను బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి ప్రవేశ ఫీజు తీసుకోవద్దని ఒకటికి వందసార్లు నిబంధనలు విధించే విద్యాధికారులు దానిని వాళ్లే తుంగలో తొక్కుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తానా అంటే విద్యాధికారులు తందానా అని ఎంచక్కా విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించేలా ప్రకటన జారీ చేశారు. ఇదేమని అడిగితే విద్యాసంచాలకులు చెప్పిందే మారు శిరోధార్యం అంటూ దాటవేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షకు సంబంధించిన విషయాలు మాత్రమే తమ పరిధిలో ఉన్నాయని, అన్ని విషయాలు సంబంధిత ప్రిన్సిపాల్స్‌కు తెల్సునని దాటవేస్తున్నారు.
కోర్టుకు వెళ్లేందుకు ట్రస్మా నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రయివేట్ స్కూల్స్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) కోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు పరీక్ష నిర్వహణకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు దానికి సహకరించే తీరుతెన్నులపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పరీక్ష నిర్వహణ ఉంటే అన్ని విద్యాలయాల్లో జరగాలి. లేదా ప్రవేశ పరీక్షలే ఉండకూడదన్న నిర్ణయంతో ట్రస్మా బాధ్యులు ముందుకు సాగుతున్నారు. లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పి ఫీజు చెల్లించి పరీక్ష రాయించే విధానాన్ని ఆపడానికి విద్యార్థి సంఘాలు, మేధావులను కలుపుకుని వెళ్తామని ట్రస్మా రాష్ట్రస్థాయి నాయకులు వెల్లడించారు.