అన్నదాత వర్రీ..
కష్ట, నష్టాలను ఎదుర్కొని గత రబీ సీజన్ నుంచి గట్టెక్కిన అన్నదాతలు ప్రస్తుతం సార్వా
సాగుకు వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వరి సాగు అదను దాటిపోతున్నా చాలినంత వర్షపాతం లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలకు ఆనందపడిన రైతులు అక్కడక్కడా వరి నారుమళ్లు పోశారు. ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకెత్తిన నారుమళ్ల మాడిపోతున్నాయి.
మంగళగిరి రూరల్ : మంగళగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 54,206 హెక్టార్లకు 26,027 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పత్తి 21,464 హెక్టార్లలో సాగవుతుండగా 757 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 55, మిరప 44, పసుపు 457, చెరకు 182, కూరగాయలు 609, అరటి 1,446 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.
పత్తి సాగుకు ప్రస్తుతం వర్షాభావ సమస్య లేదు. వరి సాగు చేసే రైతులే వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వ్యవసాయ కార్యాలయాలు, ప్రభుత్వం కేటాయించిన దుకాణాల ద్వారా రైతులకు వరి విత్తనాలు విక్రయించారు. కొనుగోలు చేసిన విత్తనాలను కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలు, ఎత్తిపోతల పథకాలు, మోటారు బోర్లు, పంట కాలువల కింద నారుమళ్లు కట్టారు.
మొలకెత్తిన వరినారుమళ్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా తెగుళ్ల బారినపడటంతో పాటు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ నారుపోయని రైతులు కొందరు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకోగా, మరి కొందరు సాగుపై ఆశలు వదులుకుని పొలాలన అలానే వదిలివేయడంతో బీళ్లుగా మారుతున్నాయి.
వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే సాగు అదను దాటిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.