విద్యుత్‌శాఖలో కలకలం
►నర్సీపట్నం సబ్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం
►విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
►అధికారుల వేధింపుల వల్లేనని ఎస్‌ఎంఎస్‌లు
►పోలీస్ కేసు నమోదు, దర్యాప్తు
నర్సీపట్నం: ఉన్నతాధికారుల వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను..మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. నర్సీపట్నం ప్రశాంతనగర్‌లోని తన స్థలం ఆక్రమణ విషయంలో ఆర్డీవో సూర్యారావు కూడా అన్యాయం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదీ విద్యుత్‌శాఖ సబ్ ఇంజినీర్ జి.శివప్రసాద్ బుధవారం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పంపిన ఎస్‌ఎంఎస్. ఆ వెంటనే ఇంటిలో ఉన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన విద్యుత్‌శాఖలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణకు చెందిన శివప్రసాద్ నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నర్సీపట్నంకు చెందిన అపర్ణను వివాహం చేసుకుని పెదబొడ్డేపల్లిలో ఉంటున్నాడు. పదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల పనిభారం మోపుతున్నారని, వారి వేధింపులను తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సన్నిహితులు, కుటుంబసభ్యులకు ఉదయం 10 గంటల సమయంలో ఎస్‌ఎంఎస్‌లు పంపా డు. ట్రాన్స్‌కో డీఈఈ, ఏడీఈ, ఏఈలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడిని కావడంతో ప్రాంతీయ తత్వంతో పాటు దళితుడను అయినందున వివక్ష చూపుతున్నారని ఎస్‌ఎంఎస్‌ల్లో పేర్కొన్నాడు. 11 గంటల సమయంలో నిద్ర మాత్రలు మిం గాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతనిని కుటుంబ సభ్యు లు 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బాధితుని భార్య అపర్ణ విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఇంటికి వచ్చి రోజూ బాధపడే వాడని తెలిపింది. ఉద్యోగం చేయాలనిపించటం లేదని చెబుతుండే వారన్నారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన డీఈ, ఏడీఈ, ఏఈలపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె కంటతడి పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు నెలలుగా గైర్హాజరు
నెల రోజులు సెలవు పెట్టిన శివప్రసాద్ నాలుగు నెలలుగా విధులకు హాజరుకాలేదు. సెలవు ముగిశాక కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అతనిని ఎస్‌ఇ కార్యాలయానికి సరెండర్ చేశాం. కావాలని తప్పుడు అరోపణలు చేస్తున్నాడు. ఏనాడూ అతనిపై వేధింపులకు పాల్పడలేదు. రమేష్, విద్యుత్‌శాఖ డీఈ
ఆయన ఎవరో తెలియదు
వివిధ సమస్యలతో కోర్టుకు అనేక మంది వస్తుంటారు. న్యాయ, న్యాయాలు పరిశీలించి తీర్పు ఇస్తాం. ఎవరికి అన్యాయం చేసే విధంగా కోర్టు తీర్పు ఉండదు.
కె.సూర్యారావు,ఆర్డీవో, నర్సీపట్నం