జీపీఏ కలకలం
సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
కంభంపాటి కాబట్టి చర్యలు
బలిపశువు చేశారంటున్న అధికారులు
విశాఖపట్నం : మహావిశాఖలో జీపీఏ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకు చెందినదిగా చెబుతున్న 11.50 ఎకరాలను వేరొకరిపేరిట జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఎ) ఇవ్వడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో అక్కయ్యపాలెం సబ్‌రిజిస్ట్రార్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. లీగల్ లిటిగేషన్ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శ వినిపిస్తోంది. న్యాయస్థానంలో పరిష్క రించాల్సిన వివాదంలో కిందిస్థాయి అధికారులపై వేటు వేశారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైన ప్పటికీ తాజా పరిణామం మాత్రం విశాఖలో పెచ్చుమీరుతున్న భూ బాగోతాలకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది.
ఆయన కాబట్టి...
మర్రిపాలెం భూ వ్యవహారంలో కంభంపాటి రామ్మోహన్‌రావుకు రాజకీయ పరపతి ఉండటంతో వెంటనే స్పందించగలిగారు. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకున్నారు. అదే పరిస్థితి సామాన్యుడికి ఎదురైతే ఎవరూ పట్టించుకునేవారే కాదన్నది సుస్పష్టం.