‘చేతనైతే పాలమూరు ఎత్తిపోతల ఆపండి’
హైదరాబాద్: ఎలాంటి అనుమతుల్లేకుండా శంకుస్థాపన చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే నిలిపి వేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారం నుంచి బయట పడటానికి అష్టకష్టాలు పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా రాయలసీమ, నాగార్జునసాగర్ కింద ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి ఆయన చెప్పింది నిజం కాదని వారు ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తన విషయం మాట్లాడుకుంటున్నారే తప్ప ఎత్తిపోతల పథకం గురించి కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని ప్రజల, రైతుల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లలో పూర్తి చే యాల్సిన పోలవరం పనులు పూర్తిగా నిలిచి పోయాయని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరితే తప్పవుతుందా! అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.