సాక్షి, ఏలూరు : వెలుగుల శాఖను అవినీతి చీకట్లు వెంటాడుతున్నాయి. అక్రమాల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ కుంభకోణం, ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌వైర్ల చోరీ, వ్యవసాయ సర్వీసులకు లంచాల డిమాండ్ వంటి అక్రమాలతో విద్యుత్ శాఖ అప్రతిష్ట పాలైంది. తాజాగా సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాలలో అవకతవకలు బయటపడ్డాయి. ఇటీవల విద్యుత్ శాఖలో అవినీతిపై ‘సాక్షి’ వరుస కథనాలతో సామాన్యుల్లో కదలిక వచ్చింది. ఆ శాఖ అధికారుల అవినీతిచిట్టాలను ఒక్కొక్కటిగా విప్పుతున్నారు. దీంతో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో ఉన్నతాధికారుల అవినీతి వెలుగుచూసింది. నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొలువులను అమ్ముకుంటున్న వైనం బయటపడింది.
8 నుంచి 10 మంది నియామకం
జిల్లాలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 195 ఉన్నాయి. వీటిలో 152 సబ్‌స్టేషన్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలోనూ, 43 సబ్‌స్టేషన్లు ఈపీడీసీఎల్ నిర్వహణలోనూ ఉన్నాయి. జిల్లాలో కొత్త సబ్‌స్టేషన్లను ప్రతిఏటా నిర్మిస్తున్నారు. గతేడాది 13 సబ్‌స్టేషన్లను రూ.14 కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది 22 సబ్‌స్టేషన్లను రూ.26.06 కోట్లతో నిర్మించడానికి అనుమతిపొందగా 20 పూర్తయ్యాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌కు నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో నిరుద్యోగులు పోటీపడ్డారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు క్యూకట్టారు. వారితో సిఫార్సు చేయించారు. ఎవరినీ నొప్పించడం ఇష్టంలేని ఈపీడీసీఎల్ అధికారులు కాంట్రాక్టర్‌తో సయోధ్య కుదుర్చుకుని సబ్‌స్టేషన్‌లో 8 నుంచి 10 మంది చొప్పున ఆపరేటర్లను అనధికారికంగా నియమించేశారు. ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
6నెలలుగా జీతాల్లేవ్
సిబ్బంది ఎక్కువ కావడంతో ఎవరికి నియామక పత్రాలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆరు నెలలుగా ఎవరికీ జీతాలు లేవు. ఇటీవల ప్రారంభమైన ఉండ్రాజవరం మండలం పాలంగి సబ్‌స్టేషన్‌లో ఓ షిఫ్ట్ ఆపరేటర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను గత జూన్ 1 నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటికీ ఒక్కరూపాయి కూడా జీతం ఇవ్వలేదని తెలిపారు. శిక్షణలో ఉన్నానని చెబుతూ తనపేరు బయటపెడితే ఉద్యోగం పోతుందనే భయం వ్యక్తం చేశారు.
ఔను నిజమే: ఎస్‌ఈ
నిడదవోలు డివిజన్‌లోని పలు సబ్‌స్టేషన్లలో అక్రమ నియామకాలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, సబ్‌స్టేషన్‌లో నలుగురు చొప్పున మాత్రమే షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నారని డివిజనల్ ఇంజినీర్ సీహెచ్ నాగేశ్వరావు చెప్పారు. దీనిపై ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా షిఫ్ట్ ఆపరేటర్లను ఉండాల్సిన దా నికంటే అధికంగా నియమించిన మాట వాస్తవమని, నిడదవోలుతో సహా కొన్ని మండలాల్లో ఇలా జరిగిందని చెప్పారు. ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.
లక్షలు కొట్టి.. ఉద్యోగం పట్టి
Published Mon, Nov 18 2013 3:22 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement