ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరి వద్ద చేస్తున్న సమర దీక్షను జయప్రదం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లాలోని పార్టీ శ్రేణులకు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. టీడీపీ నాయకులు పోస్టర్ల ద్వారా ప్రతి గ్రామంలో రైతులు రుణాలు చెల్లించవద్దు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాఫీ చేస్తారని ప్రచారం చేసుకున్నారన్నారు.
ఎన్నికలలో రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలతో అరకొర మాత్రమే మాఫీ చేసి రైతులను దారుణంగా మోసం చేశారన్నారు. మాఫీ అయిన మొత్తం రైతులకు కనీసం వడ్డీకి సరిపోలేదన్నారు. కానీ దేశం నేతలు రుణమాఫీ చేశామని చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు.
డ్వాక్రా మహిళలకు రుణం అంతా మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక రూ.10వేలు అన్నారన్నారు. ఇప్పుడేమో అది కూడా మూడు విడతల్లో ఇస్తానని.. మొదటి విడత రూ.3వేలు జమ చేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టిన దేశం నేతలు కొత్త ఉద్యోగం సంగతేమో కానీ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలా హామీలన్నీ తంగలో తొక్కారని.. బాబు చేసిన మోసాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. అనంతరం ప్రజలు సమస్యలు వివరించగా.. పరిష్కారానికి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, అగడూరు ఎంపీటీసీ శంకర్‌రెడ్డి, తుమ్మలపల్లె రమణారెడ్డి, సైదాపురం సురేష్, ఆర్.తుమ్మలపల్లె ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమర దీక్షను జయప్రదం చేయండి
Published Sat, May 30 2015 6:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement