షుగర్ ఫ్యాక్టరీకి అప్పుల గ్రహణం | sugar factory was in loss | Sakshi
Sakshi News home page

షుగర్ ఫ్యాక్టరీకి అప్పుల గ్రహణం

Published Wed, Sep 18 2013 2:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

sugar factory was in loss

మెట్ట రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ప్రభగిరిపట్నం షుగర్ ఫ్యాక్టరీ చివరకు ఆ రైతుల ప్రయోజనాలనే దెబ్బతీసేలా దివాలా తీసింది.


 పొదలకూరు, న్యూస్‌లైన్ :  మెట్ట రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ప్రభగిరిపట్నం షుగర్ ఫ్యాక్టరీ చివరకు ఆ రైతుల ప్రయోజనాలనే దెబ్బతీసేలా దివాలా తీసింది. ఏ శుభ ముహూర్తంలో షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాయి వేశారో కానీ రెండు దశాబ్దాలుగా ఫ్యాక్టరీని అప్పులు గ్రహణం వీడటం లేదు. ఏ యాజమాన్యం వచ్చినా రైతులకు సక్రమంగా బకాయిలను చెల్లించకపోవడంతో వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. భారతదేశంలో చక్కెర కర్మాగారాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీపై రెండు పర్యాయాలు వరుసగా ఆర్‌ఆర్ యాక్ట్‌కు గురై వేలానికి వెళ్లింది.
 
 రైతుల ప్రయోజనాల కోసం పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి గాయత్రి షుగర్స్ పేరుతో పొదలకూరుకు 10 కి.మీ దూరంలో ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలో 1994లో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన వద్ద నుంచి అప్పట్లో మాగుంట సుబ్బరామిరెడ్డి కొనుగోలు చేసి నిర్మాణ పనులు పూర్తి చేసి 1996లో క్రషింగ్‌ను ప్రారంభించారు. అనంతర కాలంలో మాగుంట కుటుంబం నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్ సంస్థ ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంది. మరి కొంత కాలానికి ఆ సంస్థ నుంచి గ్రంధి ఈశ్వరరావు కొనుగోలు చేసి సరితా షుగర్స్‌గా నామకరణం చేశారు. మధ్యలో సరితా షుగర్స్ ఒక ఏడాది క్రషింగ్ నిలిపివేయడంతో క్రెప్స్ సంస్థ క్రషింగ్ వరకు లీజుకు తీసుకుంది. తర్వాత ఈ రెండు కంపెనీల మధ్య కోర్టు వివాదాలు జరిగి రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి ఈశ్వరరావు నుంచి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కొనుగోలు చేసి వీడీబీ షుగర్స్‌గా నామకరణం చేశారు. ఆయన నుంచి నాగేశ్వరరావు అనే వ్యక్తి టేకోవర్ చేసుకుని ఎన్‌సీఎస్ షుగర్స్‌గా పేరు మార్చారు.
 
  ఈయనకు విజయనగరంలో కూడా మరో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఈ యాజమాన్యం ఆధ్వర్యంలో 2011-12లో మొదటి క్రషింగ్ సీజనే తీవ్ర వివాదాస్పదంగా మారింది. రైతులకు రూ.22 కోట్ల బకాయిలు నిలిపివేయడంతో వారు సుమారు నెల రోజుల పాటు ఫ్యాక్టరీ వద్ద ధర్నాలు, నిరసన దీక్షలు, వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కేన్ కమిషన్ ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేసి వాహనాలు, బేగాస్‌ను సీజ్ చేశారు. రెండో క్రషింగ్ సీజన్ 2012-13లో కూడా అదే పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ జోన్ పరిధి 12 మండలాలు ఉండగా, నాన్ జోన్ పరిధి వైఎస్సార్ జిల్లాలోని కొంత ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం రైతులు సైతం తమకు రూ.6 కోట్ల బకాయిలు ఇవ్వాలని ఫ్యాక్టరీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫ్యాక్టరీకి మొత్తం సుమారు 3 వేల మంది రైతులు చెరకు తోలుతున్నారు. జోన్ పరిధిలో 6 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగు చేపడుతున్నారు. ఫ్యాక్టరీ పరిస్థితి నేపథ్యంలో ఉంచుకుని ప్రతి ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది.
 
 మరోసారి ఆర్‌ఆర్ యాక్ట్
 ప్రయోగం
 షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం ఒకటి రెండు రోజుల్లో రైతులకు చెల్లించాల్సిన రూ.14 కోట్ల బకాయిలను చెల్లించకుంటే కలెక్టర్ అనుమతితో చెరకు అభివృద్ధి మండలి అసిస్టెంట్ కేన్ కమిషనర్ నేతృత్వంలో మరోసారి ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించనున్నట్లు తెలిసింది. ఫ్యాక్టరీలోని యంత్రాలను, భూమిని సైతం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైతుల ఆగ్రహానికి గురైన యాజమాన్యం ఇప్పటి వరకు బకాయిలను చెల్లించని కారణంగా ఫ్యాక్టరీ ఉద్యోగులు, అధికారులను రైతులు విధులకు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రస్తుత పరిస్థితులను ఏ యాజమాన్యం ఎదుర్కోలేదని తెలుస్తోంది.
 
 ఫ్యాక్టరీని అమ్మే యోచన?
 ఎన్‌సీఎస్ షుగర్స్‌ను అమ్మే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించిన మధుకాన్ కంపెనీ, మరో రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్లారని తెలిసింది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement