షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌కు ప్రభుత్వ పెద్దల అండ
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌కు ప్రభుత్వ పెద్దల అండ
Published Mon, Oct 17 2016 10:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
నంద్యాల రూరల్: రైతులను మోసం చేసిన నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్ గుప్తను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని వైఎస్సార్సీపీ రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. న్యాయం కోసం అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట దీక్ష చేపట్టిన రైతులకు సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రైతులను మోసగించడాన్ని నిరసిస్తూ సాయంత్రం వందలాది మంది రైతులు కర్నూలు, చిత్తూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఫ్యాక్టరీ చైర్మన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేస్తూ, ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేసిన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీలో తెలుగు తమ్ముళ్లు భాగస్వాములయ్యారని ఆరోపించారు. రైతుల ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని, లేకుంటే ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల ఆస్తులను కాపాడుకుంటామని హెచ్చరించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అమరావతి కేంద్రంగా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జాయింట్ సెక్రటరీ పిట్టం ప్రతాపరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చెరుకు రైతుల సంఘం నాయకులు బంగారురెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల దీక్షలకు కాటసాని సంఘీభావం..
షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా రైతులు చేస్తున్న దీక్షలకు సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకొని రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement