భూ అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదలొద్దని, బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేసి మూసివేయాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశించారు.
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: భూ అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదలొద్దని, బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేసి మూసివేయాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశించారు. ఖమ్మంనగర శివారులోని యూపీహెచ్ కాలనీలో సర్వేనంబర్ 302, 319లలో పట్టాదారుల పేరుతో విక్రయించిన ప్లాట్లను మళ్లీమళ్లీ విక్రయించి అనేక మందిని మోసం చేశారని బాధితులు ఇటీవల ఎస్పీని కలిసి మొరపెట్టుకున్నారు. ఈ అక్రమాలపై బాధితులు అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. మరి కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సోమవారం ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఎస్పీని కలిశారు. 10 సంవత్సరాల క్రితం ఈ ప్లాట్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా చేశారని, గతంలో ఉన్న రోడ్లను కూడా మార్చారని విన్నవించారు. ఈ అక్రమాల్లో రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘం నేత రాఘవులు, రౌడీ షీటర్ లింగనబోయిన లక్ష్మణ్, బొల్లి రాములు, బల్లేపల్లి రాములు ఉన్నారని బాధితులు ఎస్పీకి వివరించారు.
ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఎస్పీ పది రోజుల్లోగా ఇక్కడి వివాదాలను పరిష్కరించాలని డీఎస్పీ బాలకిషన్‌రావు, తహశీల్దార్ అశోక్‌చక్రవర్తిలను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణాలు జరగలేదని, ఇప్పుడైతేనే సర్వే చేసి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ అన్నారు. వివాదాస్పద ప్లాట్లలో ఉన్న నిర్మాణాలు తొలగించాలని, ఈ ప్లాట్లు తొలుత కొనుగోలు చేసిన వారికే చెందుతాయని అన్నారు. తర్వాత కొనుగోలు చేసిన వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పాత లే అవుట్ ప్రకారం సర్వే చేసి తొలుత కొనుగోలుదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని, సర్వే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, సర్వే తప్పుగా చేస్తే మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులను ఎస్పీ పరోక్షంగా హెచ్చరించా రు. ప్లాట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలని, పరిస్థితి విషమిస్తే పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తమ ప్లాటులో జేసీబీతో కందకం తవ్వారని ఓ వృద్ధురాలు ఎస్పీకి వివరించింది. ఈ అక్రమాల వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలేదని అన్నా రు. భూ ఆక్రమణల వెనుక ఎవరెవరు ఉన్నారో జాబితా సిద్ధం చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాలకిషన్‌రావు, తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య, ట్రైనీ ఎస్సై, సర్వేయర్ ఉన్నారు.