- ఆదిలోనే హంసపాదు
- సబ్సిడీపై ప్రభుత్వం వెనకడుగు!
- 226 యూనిట్లు ప్రారంభిస్తామని చెప్పి.. 8 కే పరిమితం
- గడువు సమీపిస్తున్నా ఖరారు కాని వాటర్‌ప్లాంట్ ధర
- ఏజెన్సీలో పథకం లేనట్టే
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పథకం ప్రారంభించకముందే ప్రభుత్వం చేతులెత్తేసింది. రూ.2 కే 20 లీటర్ల మంచినీరు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు.. తీరా సబ్సిడీపై వెనకడుగు వేసింది. మండలానికి 5 చొప్పున 226 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఇప్పుడు నియోజకవర్గానికి కేవలం ఒకటి చొప్పున కేవలం 8 యూనిట్లకే పరిమితమవ డం ఈ అనుమానాలకు తావిస్తోంది. అవి కూడా గడువు (అక్టోబర్ 2) నాటికి ప్రారంభమవుతాయో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ప్లాంట్ ధర ఖరారు కాకపోవడం.. ప్రభుత్వం తీరు కారణంగా పరిశ్రమలు ముందుకు రాకపోవడం.. ప్లాంట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ఈ పథకం అమలు అగమ్యగోచరంగా మారింది.
విశాఖ రూరల్ :ఎన్టీఆర్ సుజలధార పథకం కింద జిల్లాలో 376 గ్రామాల్లో తాగునీటి సరఫరా యూనిట్లు లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ప్రభుత్వాదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 156 మంది దాతలు (పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు) మాత్రమే ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. ఇందుకు సంబంధించి నీటి ఇబ్బందులు అధికంగా ఉండే గ్రామాలను కూడా గుర్తించారు.
నీటి సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, నిర్వహణ బాధ్యతలు వేరెవరికైనా అప్పగించాలని కొన్ని సంస్థలు అధికారులను కోరాయి. యూనిట్ల ధర కూడా నిర్దిష్టంగా ఉంటే కొనుగోలు సులభంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు. దాని ప్రకారం అధికారులు టెండర్లు ఆహ్వానించినా దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
8 యూనిట్లకే పరిమితం
తొలి దశలో 226 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు ముందు కసరత్తు చేశారు. ఈ యూనిట్‌కయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యతలను కంపెనీలే చూసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం తీరుతో ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు సైతం ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. పంచాయతీలకు అప్పగించాలని భావించినా, వాటికి మరింత ఆర్థిక భారం పడుతుందన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ యూనిట్ల నిర్వహణకు ప్రధాన ఖర్చు విద్యుత్.
ఈ విద్యుత్ వినియోగ ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ముందు ప్రకటించింది. అయితే నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో తెలియకపోవడం.. ప్రధానంగా ఎక్కువ యూనిట్లు ప్రారంభించడం వల్ల విద్యుత్ సబ్సిడీ భారం ఎక్కువవుతుందని భావించిన ప్రభుత్వం తూతూ మంత్రంగా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో తొలి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేవలం 8 నియోజకవర్గాల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అది కూడా ఏయే గ్రామాల్లో వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేయాలో ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. ప్లాంట్ల ధర కూడా ఇంకా ఖరారు కాలేదు.
ఏజెన్సీలో పథకం లేనట్టే
తొలి దశలోనే ఏజెన్సీలోని 50 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినప్పటికీ.. ప్రభుత్వం తీరుతో ఒక్క యూనిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు. పాడేరు, అరకు వంటి నియోజకవర్గాల్లో సైతం ఈ పథకాన్ని ప్రారంభించడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 2న ఎన్ని యూనిట్లతో పథకాన్ని ప్రారంభిస్తారన్న విషయంపై అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.