నీళ్ల కోసం
- నీటి కోసం కలెక్టరేట్‌కు దండయాత్ర
- తాగునీటి సరఫరా ఆగిపోవడంపై ఆగ్రహం
- అధికారులను తోసేసి..పోలీసుల్ని కొట్టేసి..
- కలెక్టర్ చెప్పినా శాంతించని గ్రామీణులు
- మూడు గంటలు స్తంభించిన గ్రీవెన్స్‌సెల్
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: గ్రామాల్లో నీటి ఎద్దడి ఎలా ఉందో చెప్పడానికి జనం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. దాహార్తి తీర్చాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. అధికారులను తోసేశారు. తలుపులు మూసేసిన పోలీసుల్ని బిందెలతో కొట్టారు. పరిపాలనను గ్రామీణులు మూడు గంటలకుపైగా స్తంభింపజేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. చిత్తూరులోని కలెక్టరేట్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ పరిమాణంతో అధికారులు బిత్తరపోయారు.
తవణంపల్లె, బంగారుపాళెం, ఐరాల, పాకాల మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. బోర్లు ఎండిపోయాయి. పాడిపైనే ఆధారపడ్డ రైతులు నీళ్లు లేక కష్టాలబాట పట్టారు. దీనికితోడు 11 నెలల బిల్లులు ఇవ్వలేదనే కారణంతో గ్రామాలకు అద్దె నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. ఆగ్రహించిన తవణంపల్లె, బంగారుపాళెం, ఐరాల, పాకాల మండలాల్లోని జనం ట్రాక్టర్లు, ఆటోలు, బస్సుల్లో కలెక్టరేట్‌కు సోమవారం చేరుకున్నారు.
ఇంతలోపు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గదిని చూడడానికి కలెక్టర్, ఇతర అధికారులు అక్కడికి వెళ్లారు. గంటసేపు అధికారుల రాక కోసం ప్రజలు నిరీక్షించారు. అధికారులు రాగానే ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లోకి వెళుతుండగానే అడ్డుపడ్డారు. దారి వదలలేదు. కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ నీటి సరఫరాకు ఇప్పటికే రూ.4 కోట్ల వరకు నిధులు వస్తే జిల్లా మొత్తం సర్దుబాటు చేశామన్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు.
ఇవి వచ్చిన వెంటనే ట్యాంకర్ల బకాయిలు చెల్లిస్తామని గ్రీవెన్స్‌సెల్‌లోకి వెళ్లిపోయారు. సంతృప్తి చెందని ప్రజలు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఖాళీ బిందెలతో కలెక్టరేట్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాది మంది మహిళలున్న ప్రాంతంలో బందోబస్తుకు ఒక్క మహిళా కానిస్టేబులూ లేకపోవడంతో ఆగ్రహించిన మహిళలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతుల్లో ఉన్న ఖాళీ బిందెలతో పోలీసుల తలపై కొడుతూ లోపలకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. టూటౌన్ సీఐ రాజశేఖర్ కలెక్టరేట్‌కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తర్వాత గ్రీవెన్స్‌సెల్ వద్దకు ప్రజల్ని అనుమతించారు. ఇక్కడే తోపులాట, అరుపులతో గందరగోళం నెలకొంది. నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గట్టిగా చెప్పడంతో ప్రజలు శాంతించారు. ఈ పరిణామాలతో అర్జీదారులు మూడు గంటలకుపైగా ఇబ్బంది పడ్డారు.
ఆవేదనను అర్థం చేసుకోండి
మేం అధికారులపై దండయాత్రకు రాలేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆవుల్ని పట్టుకుని జీవనం సాగిస్తున్నాం. మనుషులకు, మూగజీవాలకు నీళ్లులేవు. బ్యాంకర్లు రుణం కట్టమని ఇంటి దగ్గరకు వచ్చి వేధిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి. నీటి ట్యాంకర్లు రాకుండా నిలిపేశారు. న్యాయం అడగడానికి వస్తే లోపలకు పంపలేదు. మా ఆవేదనను అర్థం చేసుకోండి.
-రమాదేవి, వైఎస్ గేటు, ఐరాల