బడభాగ్ని
నెల్లూరు(పొగతోట) : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న మొన్నటి వరకు చలి, మంచు ప్రభావంతో పెద్దగా ఎండ తీవ్రత అనిపించలేదు. ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడంతో ఎండకు, ఉక్కపోతకు ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. రాబోయే వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి.
గతేడాది ఏప్రిల్ 17వ తేదీ 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే 2018 ఏప్రిల్ 17వ తేదీ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమయ్యాయి. రాబోయే వారం రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రభావం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బయపడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థలు వినియోగదారులు రాకపోవడంతో బేరాలు లేక ఎదురు చూపులు చూస్తున్నారు.
సినిమా థియేటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడంలేదు. సాయంత్రం 6.30 గంటల తర్వాత చల్లగాలు వీస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. నగరంలో 38.5 డిగ్రీలు నమోదైతే ఉదయగిరి ప్రాంతంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల నివారణ సంస్థ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే కానీ బయటకు రావదంటున్నారు. ఉదయం 9 సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగా అధికంగా తీసుకోవాలంటున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా గొడుగు వేసుకోవాలంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment