కారంచేడు, న్యూస్‌లైన్: మట్టిలో మాణిక్యాలు.. ఎదిగిన కొద్దీ ఒదిగివుండే వ్యక్తిత్వమున్న తాళ్ళూరి సునీల్‌చౌదరి, జాగర్లమూడి రంగనాయకులు కారంచేడు ముద్దు బిడ్డలని కేంద్రమంత్రి డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం రాత్రి చినవంతెన సెంటర్‌లో జరిగిన హైకోర్టు అదనపు న్యాయమూర్తి తాళ్లూరి సునీల్‌చౌదరి, సెక్యూరిటీ సెర్చ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాగర్లమూడి రంగనాయకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దగ్గుబాటి దంపతులు హాజరయ్యారు.
మాజీ ఎంపీపీ యార్లగడ్డ వెంకటరాఘవయ్య అధ్యక్షతన, వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాల అధ్యాపకులు పేర్ని వెంకటేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సన్మాన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ కారంచేడు గడ్డ నుంచి ఎందరో విశిష్ట వ్యక్తులు ఉద్భవించారని అన్నారు. విశిష్ట పౌర సన్మానం అందుకుంటున్న వారి తల్లిదండ్రులు ఎంతో ధన్యులని ఆమె కొనియాడారు. కారంచేడు గ్రామ కోడలిగా ఇక్కడ అందరి సమక్షంలో మాట్లాడటం తనకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యులమన్నారు. ఇద్దరినీ ఒకేసారి దగ్గుబాటి దంపతులు దుశ్శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు సన్మానించారు. తోటి చిన్ననాటి స్నేహితులు, గురువులు సన్మాన గ్రహీతలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సన్మానగ్రహీతల చిన్ననాటి స్నేహితులు, న్యాయవాదులు, ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ పాల్గొన్నారు.
మట్టిలో మాణిక్యాలుగా సునీల్‌చౌదరి, రంగనాయకులు
Published Thu, Jan 16 2014 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement