‘హోదా’ గురించి సుప్రీంకు గవాస్కర్ లేఖ
న్యూఢిల్లీ: బీసీసీఐలో ప్రస్తుత తన స్థానం గురించి స్పష్టత ఇవ్వాలని తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ఐపీఎల్-7 సీజన్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గత మార్చిలో గవాస్కర్‌ను సుప్రీం కోర్టు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ పూర్తయ్యే దాకా అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా శ్రీనివాసన్‌ను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
‘మార్చి చివరలో ఐపీఎల్ ముగిసేదాకా నేను తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుప్రీం ఆదేశించింది. మే మధ్యలో ఓ సారి.. తాము ఆదేశించే వరకు పదవిలో కొనసాగాలని నాతోపాటు శివలాల్ యాదవ్‌కు సూచించింది. అందుకే అయోమయ పరిస్థితి తొలగించుకునేందుకు లేఖ రాశాను. అయితే ఈ బాధ్యతల్లో ఉన్నందుకు బోర్డు నుంచి తగిన పరిహారం ఇప్పించాలని కోర్టుకు లేఖ రాసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం’ అని గవాస్కర్ స్పష్టం చేశారు.