పగలు ఎండ.. రాత్రి చలి
మధ్యాహ్నం చుర్రుమంటోంది
రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
ఏజెన్సీలో వింత వాతావరణం
చింతపల్లి: చల్లని వాతావరణానికి నిలయమైన మన్యంలో వింతవాతావరణం చోటుచేసుకుంది. వేసవికి ముందే మధ్యాహ్నంపూట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రానున్న రోజుల్లో ఏజెన్సీలో ఎండలు మైదానానికి ఏమాత్రం తీసిపోవని ఇక్కడి పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హుద్‌హుద్ కారణంగా మన్యంలో వేలాది వృక్షాలు కూలిపోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలనున్నాయని చెబుతున్నారు.
కాగా ఇప్పటికీ ఇక్కడ రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి వణికిస్తోంది. బుధవారం చింతపల్లిలో 8 డిగ్రీలు, లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో ఏటా మహాశివరాత్రి ముగిసే వరకు తక్కువ ఉష్ణోగ్రతులు నమోదవుతుంటాయి. ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో శీతాకాలంలో కచ్చితంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ ఏడాది మాత్రం అక్కడ కూడా మూడుకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. హుద్‌హుద్ కారణంగానే ఈ పరిస్థితి అని శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ చెబుతున్నారు.