చలిలో నిద్ర.. దోమల బెడద
వణికిస్తున్న చలి.. చన్నీళ్ల స్నానం.. దోమల బెడద. రోజూ సగం నిద్ర. కప్పుకుందామంటే దుప్పట్లు లేవు.. పుస్తకాలు, దుస్తులు భద్ర పర్చుకుందామంటే బాక్సుల్లేవు. సన్నబియ్యం అన్నమైనా.. సప్పటి కూరలే.. ఇవి ఎస్సీ బాలుర వసతిగృహం విద్యార్థుల ఇబ్బందులు. హాస్టళ్లలో సమస్యలు తెలుసుకునేందుకు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గంగాధరలోని ఎస్సీ వసతి గృహ విద్యార్థులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బొడిగె శోభ: బాబూ.. నీపేరేంటి?
విద్యార్థి: నాపేరు సాయికిరణ్
బొడిగె శోభ: ఏ ఊరు?
సాయికిరణ్ : తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్
బొడిగె శోభ: బాగా చుదువుతున్నావా?
సాయికిరణ్ : చదువుతున్నా మేడం. క్లాసులో సెకండ్ వస్తున్నా
బొడిగె శోభ: సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా? దొడ్డు బియ్యంతోనా?
రాజకుమార్ : సన్న బియ్యంతోనే మేడం
బొడిగె శోభ: మెనూ ప్రకారం భోజనం, కూరలు పెడుతున్నారా?
ఎ.రాజకుమర్ : ఉదయం టిఫిన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం అన్నం పెడుతున్నారు. 5 రోజులు గుడ్లు ఇస్తున్నారు. పండ్లతోపాటు ప్రతి బుధవారం స్వీటు ఇస్తారు
బొడిగె శోభ: మీకేమైనా సమస్యలు ఉన్నాయా?
వెంకటేశం : రాత్రి పూట దోమల బెడద ఎక్కువ ఉంది. చలికాలం.. ఉదయం చన్నీళ్లతో స్నానం చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. కింద పడుకుంటే నేల చల్లగా ఉంటుంది, బెడ్లు ఇస్తమన్నారు కానీ.. రాలేదు
బొడిగె శోభ: ప్రభుత్వం దోమ తెరలు అందజేయలేదా?
వార్డెన్ : మూడు సంవత్సరాల క్రితం అందించిన దోమ తెరలు చినిగి పోయినయ్
బొడిగె శోభ: ఇంకేమైనా సమస్యలున్నాయా?
సంతోష్ : చలికాలం బాగా చలి పెడుతుంది. బెడ్ షీట్లు కావాలి
బొడిగె శోభ: వసతి గృహంలోని విద్యార్థులందరికీ నేనే శాలువాలు ఇస్తా. (45 మంది విద్యార్థులకు శాలువాలు పంపిణీ చేశారు)
బొడిగె శోభ: వార్డెన్ రోజూ వస్తున్నాడా?
విద్యార్థులు: వస్తున్నారు మేడం
రాంబాబు : తినడానికి ప్లేట్లు లేవు మేడం.
బొడిగె శోభ: ప్లేట్లు ఇస్తే బాగా చదువుకుంటారా.. క్లాస్ ఫస్ట్ వస్తారా?
రాంబాబు: తప్పకుండా మేడం
బొడిగె శోభ: కొండన్నపల్లి మాజీ సర్పంచ్ రేండ్ల రాజిరెడ్డి మీకు ప్లేట్లు అందజేస్తారు.
వంశీకృష్ణ: జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తే హాస్పిటల్‌కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ బాగా దూరంగా ఉంది
బొడిగె శోభ: వైద్యాధికారితో మాట్లాడి వారానికి రెండుసార్లు వసతి గృహానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తా
బొడిగె శోభ: వార్డెన్ గారూ.. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ?
వార్డెన్: సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లా మేడం. హాస్టల్లో నీటి సమస్య పరిష్కారానికి సబ్ మెర్సిబుల్ పంపు కావాలి.
దోమ తెరల కోసం
కలెక్టర్‌తో మాట్లాడుతా..
బొడిగె శోభ, చొప్పదండి ఎమ్మెల్యే
గత ప్రభుత్వాలు వసతిగృహ విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. పేద విద్యార్థులు కడుపు నిండా భోజనం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం హాయాంలో సన్నబియ్యం అందిస్తున్నాం. వసతిగృహ సందర్శనలో విద్యార్థులు దృష్టికి తీసుకువ చ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. దోమల బెడద నివారణకు పంపిణీ చేసే దోమ తెరల విషయం కలెక్టర్‌తో మాట్లాడుతా. ఐఏఎస్, ఐపీఎస్‌లు అందరూ ప్రభుత్వ పాఠశాలలు, వ సతిగృహాల్లో చదువుకున ్న వారే. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాావాలి.