
వడదెబ్బ మరణాలు @102
శ్రీకాకుళం: వడగాడ్పుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో జిల్లాలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు శతాధిక వృద్ధుడితో సహా 21 మంది మృతి చెందారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 102కు పెరిగింది.
బైరిలో ఒకరు...
శ్రీకాకుళం రూరల్: మండలంలోని బైరి గ్రామానికి చెందిన చాట్ల సరస్వతి (35) శనివారం వడ దెబ్బతో చనిపోయిందని స్థానికులు తెలిపారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఖండ్యాంలో మహిళ మృతి
రేగిడి: ఖండ్యాం గ్రామానికి చెందిన సవర నర్సమ్మ (65) ఎండవేడిని తట్టుకోలే వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిందని ఎంపీటీసీ సభ్యులు గొలివి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఇంట్లోనే ఉన్న నర్సమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయిందని, దీంతో వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కాగా మండలంలో ఇంతవరకు వడదెబ్బతో మృతి ఐదుగురు చనిపోయారు.
పాలకొండలో ఇద్దరు..
పాలకొండ రూరల్: మంగళాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు బచ్చల సత్తెమ్మ(75) తన ఇంటి వద్ద ఎండను తట్టుకోలేక ఆదివారం మృతి చెందింది. సత్తెమ్మ మృతి విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేస్తామని సర్పంచ్ కరణం విశాలాక్షి, వైఎస్సార్‌సీపీ నేత కరణం నానిబాబు తెలిపారు. అలాగే అంపిలి గ్రామానికి చెందిన జడ్డు సూరమ్మ(65) మధ్యాహ్నం 12 గంటల సమయంలో బహిర్భూమికి నాగావళి నదీ తీరానికి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో వడదెబ్బకు గురై మృతి చెందింది.
ధర్మవరంలో వృద్ధుడు మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: ధర్మవరం గ్రామానికి చెందిన వృద్ధుడు కునుకు తవుడు (70) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం పశువులను మెతకు తీసుకెళ్లి ఆయన ఎండ తీవ్రతకు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
సంతకవిటిలో ముగ్గురు..
సంతకవిటి :మండలంలో ముగ్గురు ప్రాణాలను వడగాల్పులు హరించాయి. సంతకవిటికి చెందిన 65 ఏళ్ల ఇజ్జని పార్వతమ్మ ఆదివారం మధ్యాహ్నం తిరుగాడుతుండగానే సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందింది. సిరిపురం గ్రామానికి చెందిన అదపాక సత్యం (70) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, వేడు గాలులు తట్టుకోలే చనిపోయినట్టు అతని భార్య నర్సులమ్మ తెలిపారు. అలాగే చిన్నయ్యపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు మామిడి రాములమ్మ (72)ఆదివారం సాయంత్రం జ్వరం, వడదెబ్బతో చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు.
వృద్ధుడు మృతి
మెళియాపుట్టి: వసుంధర గ్రామానికి చెందిన వృద్ధుడు సింహాద్రి పాత్రో (67) వడ దెబ్బకు మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి అక్కడే ఎండ వేడిమికి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబీకులు చూసి వైద్యం నిమిత్తం పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని డీటీ రాజేశ్వరరావు, ఎమ్మారై వైకుంఠరావు, వీఆర్వో బాలరాజు, ఎస్సై సంధీప్‌కుమార్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.
కైజోలో ఒకరు..పలాస రూరల్: కైజోల గ్రామానికి చెందిన రాణా రవణమ్మ(65) వడదెబ్బతో మృతి చెందింది. శనివారం రాత్రి నిద్రపోతుండగా ఉక్కపోత, వేడి గాల్పులకు తట్టుకోలేక చనిపోయారు.
నరసన్నపేటలో ఇద్దరు..
నరసన్నపేట: నరసన్నపేట హడ్కోకాలనీకి చెందిన ఆశెపు శంకరరావు (35) వడదెబ్బతో మృతి చెందారు. రోజు కూలీగా పనిచేసే శంకరరావు రెండు రోజులుగా వేడిగాలులు తట్టుకోలేక జ్వరం వచ్చి అనారోగ్యానికి గురయ్యారని, ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అతని భార్య తవిటమ్మ తెలియజేశారు. కాగా స్థానికులు విరాళాలు సేకరించి శంకరరావు అంత్యక్రియలు పూర్తి చేశారు.
విశ్రాంత ఆర్మీ ఉద్యోగి..
నరసన్నపేట గొండువీధికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెహర గోవిందరావు (70) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు. రెండు రోజులుగా వీస్తున్న వేడి గాలులు, ఎండను తట్టుకోలేని ఆయన మృత్యువత పడినట్టు కుటుంబీకులు తెలిపారు.